- స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు అయినా వివక్ష తగ్గలే
- అంబేద్కర్ జయంతి వాల్‌పోస్టర్‌లో నా పేరు పెట్టకుండా కాంగ్రెస్ కుట్ర చేసింది
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
సిద్దిపేట రూరల్, వెలుగు : ‘స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా దళితులపై వివక్ష కొనసాగుతూనే ఉంది, అంబేద్కర్ జయంతి వాల్ పోస్టర్‌లో నా పేరు పెట్టకుండా కాంగ్రెస్ కుట్ర చేసింది’ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లిలో మంగళవారం నిర్వహించిన అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ సిద్దిపేట కలెక్టర్ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తున్నారని, ఆ పార్టీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని విమర్శించారు. అంబేద్కర్ జయంతి వాల్‌పోస్టర్‌లో తన పేరు పెట్టకుండా చేసి దళితులను అవమానించారన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ పురుషులతో సమానంగా స్త్రీలకు ఆస్తి హక్కులు ఉండాలని అంబేద్కర్ చెప్పారని, హరిత విప్లవ సంధాన కర్త బాబు జగ్జీవన్‌రామ్ అని కొనియాడారు.

