
- యాక్ట్ ప్రకారం 3 గ్రూపులకు 1, 9, 5 శాతం రిజర్వేషన్లు
- ఆ మేరకు అర్హులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఎస్సీ వెల్ఫేర్ లేఖ
- స్కీమ్ కు ఎస్సీల నుంచి లక్షా 44 వేల మంది అప్లై
- మండలాల్లో అప్లికేషన్ల స్ర్కూటినీ పూర్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ లో ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ను అమలు చేయనుంది. వర్గీకరణపై చట్టం చేసిన విధంగా మూడు గ్రూపుల్లో 59 కులాలకు 15 శాతం రిజర్వేషన్ల ప్రకారం అర్హులను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ లేఖ రాసింది. స్కీమ్ కు ఎస్సీల నుంచి వచ్చిన మొత్తం అప్లికేషన్లను ఈ కులాల వారీగా.. ఏ కేటగిరీ లోన్లకు ఎంత మంది అప్లై చేశారు? డివైడ్ చేసి ఏ కులం నుంచి ఎంత రిజర్వేషన్ వర్తిస్తుంది? అన్న వివరాలు, ఎస్సీ వర్గీకరణ చట్టంలో మూడు గ్రూపులుగా డివైడ్ చేసిన కులాల జాబితాను కలెక్టర్లకు రాసిన లేఖలో పొందుపరిచారు. వర్గీకరణ యాక్ట్ చేసిన తరువాత ప్రభుత్వం అమలు చేస్తున్న తొలి స్కీమ్ రాజీవ్ యువ వికాసం కావడం విశేషం.
అప్లికేషన్లను స్ర్కూటినీ చేస్తున్న బ్యాంకులు
రాష్ట్ర వ్యాప్తంగా స్కీమ్ కు వచ్చిన మొత్తం 16, 23,764 లక్షల అప్లికేషన్లను ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లు వెరిఫై చేశారు. ప్రభుత్వం ఈ ఏడాది 5 లక్షల మందికే అమలు చేయనుండగా.. అప్లికేషన్లు రెండు రెట్లు అధికంగా వచ్చాయి. స్కీమ్ లో మహిళలకు 25 శాతం, దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. వీటితో పాటు రూ.4 లక్షల లోన్ కేటగిరీకే రికార్డు స్థాయిలో సుమారు 12 లక్షల మంది అప్లై చేశారు. ప్రస్తుతం బ్యాంకు అధికారులు స్ర్కూటినీ చేస్తున్నారని ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 25 శాతం అప్లికేషన్లు పూర్తయ్యాయని, వారంలోగా వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హులయిన లబ్ధిదారుల లిస్ట్ ను జిల్లా కలెక్టర్లకు బ్యాంకులు అందజేయనున్నాయి. వచ్చే నెల 2న అర్హులకు ప్రభుత్వం లోన్ మంజూరు పత్రాలు అందజేయనుంది. ఇందులో లోన్ తీసుకొని అసలు, వడ్డీ లేట్ గా కట్టిన వారిని డిఫాల్టర్లుగా బ్యాంకులు అనర్హులుగా గుర్తిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం ఇచ్చిన గైడ్ జీవోలో అప్లికేషన్ కు సిబిల్ స్కోర్ ప్రస్తావించకపోయినా బ్యాంకులు స్కోర్ ను చూస్తున్నాయి. అయితే, ఈ అంశంపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించి.. ఈ స్కీమ్ కు సిబిల్ స్కోర్ తో సంబంధం లేదని ప్రకటించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదని బ్యాంకు అధికారులు చెబుతుండగా, జీవో లో సిబిల్ స్కోర్ అంశం లేనపుడు ప్రభుత్వం ఎందుకు ఉత్తర్వులు ఇస్తుందని ఎస్సీ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రూ.6 వేల కోట్లతో 5 లక్షల మందికి స్కీమ్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ పథకం కింద అర్హత పొందిన వారికి రెండు దఫాలుగా వారి అకౌంట్లలో నగదు జమకానుంది.
ఎస్సీల నుంచి లక్షా 44 వేల అప్లికేషన్లు
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు 33 జిల్లాల్లోని ఎస్సీల నుంచి మొత్తం లక్షా 44,800 మంది అప్లై చేశారు. ఇందులో గ్రూప్ 1 నుంచి 9,600 మంది, గ్రూప్ 2 నుంచి 88,900, గ్రూప్ 3 నుంచి 48,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా గ్రూప్ 2 లో 62.748 శాతం జనాభా ఉన్న 18 కులాల నుంచి ఎక్కువ అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ అప్లికేషన్లను మూడు గ్రూపులుగా డివైడ్ చేసి ఎస్సీ వర్గీకరణ యాక్ట్ ప్రకారం మూడు గ్రూపులకు 1, 9, 5 శాతం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు.