BJP Vs TMC: వెస్ట్ బెంగాల్‌లో మెుదలైన గేమ్.. మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు కీలక అవకాశం

BJP Vs TMC: వెస్ట్ బెంగాల్‌లో మెుదలైన గేమ్.. మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు కీలక అవకాశం

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య చిత్తుచిత్తుగా ఓడిన తృణమూల్ కాంగ్రెస్(TMC) అధినేత్రి మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు ఒక కీలకమైన అవకాశాన్ని కల్పించింది. ఓటర్ల జాబితా సవరణ(SIR) సమయంలో జరిగిన అవకతవకలే తమ ఓటమికి కారణమని వాదిస్తున్న దీదీకి.. అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు బెంగాల్ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

విజయం కంటే ‘డిలీషన్’ ఎక్కువా?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 స్థానాలతో ప్రభంజనం సృష్టించగా.. టీఎంసీ కేవలం 80 స్థానాలకే పరిమితమైంది. అయితే ఈ ఫలితాలకు కారణం ఓటర్ల జాబితాలో భారీ అక్రమాలేనని టీఎంసీ ఆరోపిస్తోంది. సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ కల్యాణ్ బెనర్జీ ఒక కీలకమైన అంశాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలోని దాదాపు 31 నియోజకవర్గాల్లో విజేతల మెజారిటీ కంటే.. అక్కడ తొలగించిన ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉందని సంచలన ఆరోపణ చేశారు. అంటే ఓట్లు తొలగించకపోయి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నది టీఎంసీ వాదన.

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం:
చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను నిశితంగా పరిశీలించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) సమయంలో ఓట్ల తొలగింపు, చేరికపై అభ్యంతరాలు ఉంటే.. కొత్తగా దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చని మమతా బెనర్జీతో పాటుగా ఇతరులకు ధర్మాసనం అవకాశం అందించింది. ఎన్నికల పిటిషన్ ద్వారా మాత్రమే ఈ ఫిర్యాదులను పరిష్కరించుకోవాలని ఎన్నికల కమిషన్ వాదించినప్పటికీ, బాధితులు మళ్లీ అప్లికేషన్లు పెట్టుకోవడానికి సుప్రీంకోర్టు తలుపులు తెరవటం హీట్ పెంచేస్తోంది.

రికార్డు పోలింగ్.. రివర్స్ ఫలితం?
ఈ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా 90 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు చేశారు. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరిగినప్పటికీ.. ఓటర్ల జాబితాలోని లోపాల వల్ల తమకు అన్యాయం జరిగిందని మమతా బెనర్జీ వాదిస్తున్నారు. ఒకవైపు బీజేపీ భారీ విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా.. మరోవైపు సుప్రీంకోర్టు నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో ఉత్కంఠను రేపుతోంది. ఒకవేళ ఆ 31 స్థానాల్లో ఓట్ల తొలగింపు అక్రమమని తేలితే.. అది ఫలితాలను తలకిందులు చేసే అవకాశం ఉందన్న చర్చ జోరందుకుంది. మెుత్తానికి అధికార పీఠం దక్కినా బీజేపీకి ఈ కోర్టు చిక్కులు ఇప్పుడు కొత్త తలనొప్పిగా మారాయి.