నీట్ పేపర్ లీక్..కేంద్రం, NTAలకు సుప్రీంకోర్టు నోటీసులు

నీట్ పేపర్ లీక్..కేంద్రం, NTAలకు సుప్రీంకోర్టు నోటీసులు

నీట్-యూజీ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న వరుస తప్పిదాలకు శాశ్వతంగా ముగింపు పలకాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని ఆదేశించింది. పరీక్షల్లో పారదర్శకత, భద్రత కోసం తీసుకుంటున్న చర్యలపై పూర్తి వివరణాత్మక అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా... సంస్కరణలను శాశ్వతంగా సంస్థాగతం చేయాలని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా పూర్తిగా కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్షలకు మారే ప్రతిపాదనలు, డేటా రక్షణ భద్రత, అభ్యర్థుల గుర్తింపు కోసం డిజియాత్ర వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే వివరాలను సమర్పించాలని కేంద్రానికి స్పష్టం చేసింది.

డిజిటల్ మౌలిక సదుపాయాలు, భద్రత, నిఘా , పాలనతో సహా మొత్తం 10 కీలక విభాగాలలో నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సుల అమలుపై పురోగతి నివేదికను ధర్మాసనం కోరింది. అలాగే భద్రత కోసం కొత్తగా నియమించిన అదనపు డైరెక్టర్ జనరల్ పాత్ర ఏమిటనేది వివరించాలని సూచించింది. పరీక్షకు ముందు, పరీక్ష సమయంలో, పరీక్ష తర్వాత తీసుకునే ప్రతీ భద్రతా చర్యను నివేదికలో పొందుపరచాలని ఆదేశించింది.


ప్రశ్నపత్రాల రవాణాకు వైమానిక దళాన్ని ఉపయోగించడం కేవలం తాత్కాలిక చర్య మాత్రమేనని, అది శాశ్వత పరిష్కారం కాదని జస్టిస్ నరసింహ కుండబద్దలు కొట్టారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో కలిసి కేంద్రం చేపడుతున్న బహుళ విడతల పరీక్షల విధానం, ప్రశ్నపత్రాల ముద్రణ, రవాణా భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు.

కోర్టు సూచనల ఆధారంగా కొత్త అఫిడవిట్ దాఖలు చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హామీ ఇచ్చారు.ఈ మొత్తం వ్యవహారాన్ని ఏడాది పొడవునా తాము నిశితంగా పర్యవేక్షిస్తామని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.