
- షెడ్యూల్ రిలీజ్ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెల 12న స్కూళ్ల రీఓపెన్ రోజునాడే పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్ అందించాలని సర్కారు నిర్ణయించింది. ప్రభుత్వ బడుల్లో ఎన్ రోల్ మెంట్ పెంపు కోసం జూన్ 6 నుంచి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శనివారం షెడ్యూల్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 6న గ్రామసభలు నిర్వహించాలి.
దీంట్లో మహిళా సంఘాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, స్కూల్ టీచర్లు, హెడ్మాస్టర్, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్ వాడీ పిల్లలను సర్కారు ప్రైమరీ స్కూల్లలో చేర్పించేలా ప్లాన్ చేయాలని, ఐదో తరగతి పూర్తయిన స్టూడెంట్లను ఆరో తరగతిలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. 6న గ్రామ సభ నిర్వహించి, ఎల్ రోల్ మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి.
దీంట్లో మహిళా సంఘాలు, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్లు పాల్గొనేలా చూడాలి. 7న ప్రతీ ఇంటిని సందర్శించి, బడీడు పిల్లలను గుర్తించాలి. వీఈఆర్ అప్ డేట్ చేయాలి. 8 నుంచి 10 వరకు కరపత్రాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించాలి. అంగన్ వాడీ కేంద్రాలను సందర్శించాలి. డ్రాప్ ఔట్ పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలి. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి అందుబాటులో ఉన్న భవిత కేంద్రాల్లో చేర్పించాలి. 12న స్కూల్ రీఓపెన్ ను గ్రాండ్ గా నిర్వహించాలి.
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజా ప్రతినిధులతో ప్రారంభించాలి. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ లను అందించాలి. ఇదే రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించాలి. దీనికి ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి. 13న ప్రైమరీ బడుల్లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం, హైస్కూళ్లలో బాల సభ నిర్వహించాలి. 16న ఎల్ఎల్ఎన్ అండ్ ఎల్ఐపీ దినోత్సవం నిర్వహించాలి. 19న బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు నిర్వహించాలి.