హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో స్కూల్, కాలేజీ బస్సుల ఫిట్నెస్ పరీక్షలకు ప్రైవేట్ యాజమాన్యాలు ముందుకు రావడం లేదు. మరికొద్ది రోజుల్లో విద్యా సంస్థలు తెరవనున్న నేపథ్యంలో ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఫిట్నెస్ పరీక్షలు చేయించుకోవాలని ఆదేశించారు. కానీ, ఇప్పటి వరకు 40 శాతం వాహనాలు కూడా ఫిట్నెస్పరీక్షకు రాలేదు.
ప్రస్తుతం నగరంలో తిరుగుతున్న స్కూల్ బస్సుల్లో15 ఏండ్లు పూర్తయినవే ఎక్కువగా ఉన్నాయని, తనిఖీలకు కూడా రాకపోవడంతో ఈనెల 15 తర్వాత తనిఖీలు నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆర్టీఏ రూల్స్‌కు విరుద్ధంగా ఉన్న బస్సులను రోడ్లపై తిరగనివ్వమని అంటున్నారు. అయితే, కొందరు అధికారులు స్కూల్ మేనేజ్మెంట్లు ఇచ్చే ముడుపులను తీసుకుని చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారని, అందుకే ఫిట్నెస్ లేక పోయినా ధీమాగా ఉంటున్నారని తెలుస్తోంది.
మొత్తం 13,500 వాహనాలు..
గ్రేటర్ పరిధిలో స్కూల్, కాలేజీలకు చెందిన దాదాపు 13,500 వాహనాలుండగా ఇప్పటి వరకూ ఆర్టీఏలో ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందినవి చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 6200 వాహనాలుండగా 2600 , మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 6,100 వాహనాలుండగా 3,250 వెహికల్స్ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందారని చెప్తున్నారు. అంటే దాదాపు 40 శాతం వాహనాలు మాత్రమే ఫిట్‌గా ఉన్నాయని చెప్తున్నారు.
ఈ రూల్స్ పాటించాలి
స్కూల్స్, కాలజీల వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలంటే కొన్ని ప్రమాణాలను తప్పని సరిగా పాటించాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్, ఇన్స్యూరెన్స్, పొల్యూషన్సర్టిఫికెట్ ఉండాలి. పర్మిషన్ఇచ్చిన కెపాసిటీ మేరకే విద్యార్థులను ఎక్కించుకోవాలి. డ్రైవర్‌కు లైసెన్స్ఉండడంతో పాటు ఎక్స్పీరియన్స్కూడా ముఖ్యమే. బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాంటివి ఉండాలి.
బస్సు కిటికీలకు ఇరువైపులా 3 అంగుళాలకు మించకుండా పైపులను అమర్చాలి. వాహనాల బ్రేకులు, టైర్లు, లైట్లు కండీషన్లో ఉండాలి. విద్యార్థులను ఎక్కించడం, దించడం లాంటివి చూసుకోవడానికి బస్సులో అటెండర్ ఉండాలి. స్టూడెంట్స్సులభంగా ఎక్కి దిగడానికి సరైన విధంగా మెట్లు ఉండేలా చూసుకోవాలి.
కిటికీల నుంచి చేతులు, తలబయటకు పెట్టకుండా జాలీలు ఏర్పాటు చేయాలి.
డ్రైవర్ 60 ఏండ్లలోపు ఉండాలి. ఇవే కాకుండా15 ఏండ్లు పూర్తి చేసుకున్న వాహనాలను రోడ్లపై నడపడానికి వీల్లేదు. ఈ రూల్స్పాటించకపోతే ఆ వాహనాలను సీజ్చేస్తారు. ఎంవీ యాక్ట్‌ప్రకారం ఓనర్లు, డ్రైవర్లు, విద్యాసంస్థల యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తారు. తల్లిదండ్రులు కూడా ఈ అంశాలను చూడాలని అధికారులు సూచిస్తున్నారు.
