తొలిసారిగా హెచ్ఐవీకి ట్రీట్ మెంట్

తొలిసారిగా హెచ్ఐవీకి ట్రీట్ మెంట్
  • జీన్ ఎడిటింగ్ టెక్నిక్ తో ఎయిడ్స్‌‌కు ‘కత్తెర’
  • చైనా యువకుడికి హెచ్ఐవీ నుంచి విముక్తి
  • బ్లడ్ కేన్సర్ కూడా తగ్గుముఖం

చైనాకు చెందిన ఓ ఇరవై ఏడేండ్ల యువకుడు. ఎయిడ్స్ వచ్చిందని తేలడంతో ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఆ తర్వాత రెండు వారాలకు మరో పిడుగులాంటి వార్త. అతడికి బ్లడ్ కేన్సర్ (అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా) కూడా వచ్చిందని, అది కూడా అడ్వాన్స్డ్ స్టేజీలో ఉందని డాక్టర్లు చెప్పారు. ఇక ప్రాణాల మీద ఆశలొదిలేసుకున్నాడు. పూర్తిగా నిరాశతో కుంగిపోయాడు. అయితే, ఆ యువకుడి గురించి తెలుసుకున్న బీజింగ్ లోని పెకింగ్ యూనివర్సిటీ సైంటిస్టులు అతడికి జీవితంపై మళ్లీ ఆశలు చిగురించేలా చేశారు. ఎముక మజ్జ మార్పిడి చేయడంతో పాటు హెచ్ఐవీకి కూడా ట్రీట్ మెంట్ చేస్తామని, కాకపోతే ప్రపంచంలో ఇంతవరకూ ఎవరిపైనా ప్రయోగించని టెక్నిక్ ఉపయోగిస్తాం కాబట్టి.. సహకరించాలని కండిషన్ పెట్టారు. అతడు ఒప్పుకోవడంతో 2017లో ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ఇప్పుడు.. అతడికి బ్లడ్ కేన్సర్ దాదాపుగా నయమైపోయింది.  ట్రీట్ మెంట్ పూర్తయి19 నెలలు అవుతున్నా.. హెచ్ఐవీ వల్ల అతడికి ఎలాంటి ప్రాబ్లం రాలేదు!

ఏం చేశారు?

ఆ యువకుడికి ఏం ట్రీట్​మెంట్ చేశారు? ఎలా చేశారో తెలుసుకోవాలంటే.. ముందు హెచ్ఐవీ గురించి తెలుసుకోవాలి. ఎయిడ్స్ వైరస్ (హెచ్ఐవీ) మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తెల్ల రక్తకణాలను టార్గెట్ చేస్తుంది. ఒక్కో తెల్ల రక్తకణంలోకి చేరి, నాశనం చేస్తూ పోతుంది. అయితే, తెల్ల రక్తకణాల్లోకి ప్రవేశించేందుకు హెచ్ఐవీ ఒక ప్రత్యేక ప్రొటీన్ ను ఉపయోగించుకుంటుంది. ఆ ప్రొటీన్ ను మన డీఎన్ఏలోనే ఉండే సీసీఆర్5 అనే జన్యువు తయారు చేస్తుంది. అందువల్ల ఆ జన్యువును అణచివేస్తే ఆ ప్రొటీన్ ఉత్పత్తి కాదు. హెచ్ఐవీ మన తెల్ల రక్త కణాల్లోకి ప్రవేశించడం సాధ్యం కాదు. సరిగ్గా ఇదే విషయాన్ని తమ ప్రయోగానికి వేదికగా మలచుకున్నారు చైనా డాక్టర్లు.

స్టెమ్ సెల్స్ ప్రయోగాలూ సక్సెస్..

గతంలో హెచ్ఐవీ రోగులపై మూలకణాలు (స్టెమ్ సెల్స్)తో చేసిన రెండు ప్రయోగాలు కూడా సక్సెస్ అయ్యాయి. కొంతమందిలో సీసీఆర్5 జన్యువు మ్యుటేషన్ (మారిపోవడం) అయి ఉంటుంది. అలాంటి వ్యక్తుల నుంచి మూలకణాలను సేకరించి, వాటిని ల్యాబ్ లో డెవలప్ చేసి, ఇద్దరు హెచ్ఐవీ పేషంట్లలోకి ప్రవేశపెట్టారు. ఆ ఇద్దరు పేషంట్లను డాక్టర్లు లండన్ పేషంట్, బెర్లిన్ పేషంట్ అని ఇప్పటికీ చెప్పుకొంటుంటారు. లండన్ కు చెందిన ఓ వ్యక్తికి 2003లో హెచ్ఐవీ సోకింది. 2016లో హాడ్జ్ కిన్ లింఫోమా అనే కేన్సర్ కూడా వచ్చింది. అదే ఏడాది స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్ చేయడంతో అతడికి ఈ రెండు వ్యాధుల నుంచీ విముక్తి లభించింది. బెర్లిన్ కు చెందిన తిమోతీ రే బ్రౌన్ కు కూడా 12 ఏండ్ల కిందటే హెచ్ఐవీకి స్టెమ్ సెల్ ట్రీట్ మెంట్ జరిగింది. 12 ఏండ్లుగా ఎలాంటి మందులు వేసుకోవడం లేదు. అయినా అతడికి హెచ్ఐవీ నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు.

వీళ్లను హెచ్ఐవీ ఏం చేయలేదు!

ప్రపంచంలోనే చాలా అరుదుగా అతికొద్ది మందికి మాత్రమే సీసీఆర్5 జన్యువు పుట్టుకతోనే మ్యుటేషన్ అయి ఉంటుంది. దీంతో వీరిలో ఈ జన్యువు నుంచి హెచ్ఐవీకి అవసరమయ్యే ప్రొటీన్ ఉత్పత్తి కాదు. అందుకే.. హెచ్ఐవీ సంక్రమించినా.. వీరిని ఏమీ చేయలేదని సైంటిస్టులు చెబుతున్నారు. హెచ్ఐవీ సోకిన వ్యక్తులు మందులు వేసుకున్నంత కాలం వైరస్ ఎలా అణిగి ఉంటుందో.. వీరిలో ఎలాంటి మందులు వేసుకోకున్నా హెచ్ఐవీ ఏమీ చేయలేదని అంటున్నారు. అయితే, సీసీఆర్5 జీన్ మ్యుటేషన్ ఉన్న వ్యక్తులు అకాల మరణం పొందే అవకాశాలు మాత్రం 21% ఎక్కువగా ఉంటాయట! కానీ.. ఎందుకలా జరుగుతుందో మాత్రం ఇప్పటిదాకా ఎవరూ కనిపెట్టలేకపోయారు.

ఇదీ ప్రయోగం..

చైనా డాక్టర్లు ఉపయోగించిన టెక్నిక్ పేరు ‘క్రిస్పర్–కేస్9’. సింపుల్ గా చెప్పాలంటే ఇది ఓ ప్రొటీన్ కత్తెరలాంటిది. ఇది బ్యాక్టీరియాల నుంచి సేకరించే ఒక ప్రొటీన్. దీనితో మన డీఎన్ఏను ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. అంటే.. మన డీఎన్ఏలో మనకు అవసరం లేని జన్యువులను దీనితో కట్ చేయొచ్చన్నమాట. హెచ్ఐవీ పేషంట్లకు ట్రీట్ మెంట్ చేయడం కోసం ఈ టెక్నిక్​ ఇంతకుముందు ఎవరూ ఉపయోగించలేదు. ఫలితాలు ఎలా ఉంటాయో కూడా తెలియకున్నా చైనా డాక్టర్లు ధైర్యం చేశారు. యువకుడి నుంచి తెల్ల రక్తకణాలను సేకరించి, వాటి డీఎన్ఏలోని సీసీఆర్5 జన్యువును కట్ చేసి తిరిగి ఎక్కించారు. అతడి ఎముక మజ్జనూ మార్పిడి చేశారు. పేషెంట్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఈ ఎక్స్‌పరిమెంట్ లో సక్సెస్ అయ్యామని, ఇంకా ఎఫెక్టివ్ గా మార్చేందుకు రీసెర్చ్ అవసరమని పెకింగ్ వర్సిటీ సైంటిస్టులు చెప్పారు. పరిశోధన వివరాలను  ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్​ మెడిసిన్’లో ప్రచురించారు.

Scientists Use Gene Editing To Help HIV Patient Delete Disease In China