హైదరాబాద్‌‌లో 5 కార్‌‌దేఖో స్టోర్లు

హైదరాబాద్‌‌లో 5 కార్‌‌దేఖో స్టోర్లు

హైదరాబాద్‌‌, వెలుగు : సెకండ్‌‌హేండ్‌‌ కార్ల ఆన్‌‌లైన్‌‌ ఆక్షన్‌‌లోని కార్‌‌దేఖో హైదరాబాద్‌‌లో అయిదు స్టోర్స్‌‌ ప్రారంభించింది. రాబోయే ఆరు నెలల్లో సికిందరాబాద్‌‌తోపాటు, వరంగల్‌‌లోనూ స్టోర్స్‌‌ తెరవనున్నట్లు కార్‌‌దేఖో కో ఫౌండర్‌‌ ఆకాంక్ష్‌‌ సిన్హా తెలిపారు. హైదరాబాద్‌‌లో తెరచిన వాటితో కలిపి ఇండియా మొత్తం మీద 50 స్టోర్సును నెలకొల్పామన్నారు. దేశవ్యాప్తంగా మరిన్ని స్టోర్స్‌‌ ఏర్పాటు చేసేందుకు 2020 నాటికి రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు సిన్హా వెల్లడించారు. బెంగళూరు, పుణె, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌లలో తమ కార్యకలాపాలు బాగా ఊపందుకున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో 4 వేల సెకండ్‌‌హేండ్‌‌ కార్లు తమ ప్లాట్‌‌ఫామ్‌‌ ద్వారా అమ్ముడయ్యాయని తెలిపారు. ఫైనాన్స్‌‌, ఇన్సూరెన్స్‌‌, ఆర్‌‌సీ మార్పిడి వంటి అన్ని సేవలనూ కస్టమర్లకు తాము అందిస్తున్నామని చెప్పారు. రాబోయే పండగల కాలంలో కస్టమర్లకు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించనున్నట్లు సిన్హా తెలిపారు. యూజ్డ్‌‌ కార్ల వాణిజ్యం ఇండియాలో ఇప్పుడిప్పుడే సంఘటితంగా మారుతోందని, భవిష్యత్‌‌ ఆశాజనకంగా ఉందని చెప్పారు. రాబోయే ఏళ్లలో ఈ రంగం భారీగా వృద్ధి చెందే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో ఇన్వెస్టర్ల నుంచి రూ. 770 కోట్లను కార్‌‌దేఖో సమీకరించింది. ఇండోనేషియాలో ఓటీఓ.కాం పేరిట కార్యకలాపాలు మొదలుపెట్టిన కంపెనీ రాబోయే కాలంలో మరిన్ని ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించాలనుకుంటోంది. మార్చి 2019 తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 360 కోట్ల రెవెన్యూ సాధించిన కార్‌‌దేఖో ఈ ఆర్థిక సంవత్సరంలో దానిని రెట్టింపు చేయాలని టార్గెట్‌‌గా  పెట్టుకుంది.