సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది వివరాలను అధికారులు ప్రకటించారు. ఢిల్లీకి చెందిన వీరేంద్ర కుమార్ దేవకర్ (50), అన్నదమ్ములైన రాజీవ్ మాలిక్ (60), సందీప్ మాలిక్ (56)లు, చెన్నయ్ కు చెందిన సీతారామన్ (48), బాలాజీ (52) మృతదేహాలను వారి బంధువులకు అప్పగించారు. విజయవాడకు చెందిన హరీష్ (33) డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఒరిస్సాకు చెందిన చందన్ జేతి (28) సతీమణి మిథాలీలు (డెర్మటాలిస్ట్ డాక్టర్) బెంగుళూరులో పని చేస్తూ ఇటీవలే ఓ సెమినార్ కు హాజరయ్యేందుకు సిటీకి వచ్చారు. మృతి చెందిన వారిలో వీరున్నారు. వీరి మృతదేహాలు గాంధీ మార్చురీ వద్దనే ఉన్నాయి.
సికింద్రాబాద్ లో రూబీ ఎలక్ట్రిక్ షోరూం, హోటల్ మొత్తం ఐదంతస్తుల్లో ఉంది. షోరూంలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్ కు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు స్పాట్ లోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని యశోద, గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో వైజాగ్ కు చెందిన సంతోష్, యోగిత.. బెంగళూరుకు చెందిన జయంత్, కోల్ కతాకు చెందిన దేభాశీష్ గుప్తా, చెన్నైకి చెందిన కేశవన్, హర్యానాకు చెందిన దీపక్ యాదవ్, ఒడిశాకు చెందిన ఉమేష్ కుమార్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో బెంగళూరుకు చెందిన జయంత్ ఐసీయూలో ఉన్నాడు. మృతుల కుటుంబాలకు రాష్ట్రం ప్రభుత్వం 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా..కేంద్రం 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
