పునాస టైమాయె.. విత్తనాలు లేకపాయె

పునాస టైమాయె.. విత్తనాలు లేకపాయె

సోయా, కంది సీడ్స్‌ కోసం మహారాష్ట్రకు రైతుల క్యూ
కంది విత్తనాలకు 76 వేల క్వింటాళ్ల కొరత 
సోయా విత్తనాలియ్యలేక చేతులెత్తేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: పునాస సీజన్ షురూ అయితున్నా రాష్ట్రంలో రైతులకు విత్తనాల సప్లై ఇంకా పూర్తి కాలేదు. దీంతో రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఈ యేడు ఎక్కువగా సాగు చేయాలన్న కంది, సోయా విత్తనాలు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఓవైపు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మరోవైపు వానలతో సీజన్ షురూ కావడంతో విత్తనాలకు డిమాండ్​ పెరుగుతోంది. కానీ మార్కెట్​లో డిమాండ్​కు తగినన్ని విత్తనాలు దొరికే పరిస్థితి లేదు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌ కోసం వ్యవసాయ శాఖ చేస్తున్న ఏర్పాట్లు అరకొరగానే ఉన్నాయి. నిరుడు పలు జిల్లాల్లో కంది, సోయా, పత్తి విత్తనాలు లేక చాలా మంది రైతులు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దొరికిన ప్రైవేటు విత్తనాలు వేసి పంట దిగుబడి రాక నష్టపోయిన్రు. ఈ యేడు ఏర్పాట్లను చూస్తే మళ్లా అదే పరిస్థితి కన్పిస్తోందని రైతు సంఘాలు అంటున్నాయి.
కంది 76 వేల క్వింటాళ్లు కావాలె  
రాష్ట్రంలో ఈ యేడు15 నుంచి 20 లక్షల ఎకరాల్లో కంది పంట సాగు చేయాలని సర్కారు టార్గెట్‌‌గా నిర్ణయించింది. అవసరమైనన్ని విత్తనాలను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించింది. ఎకరాకు 4 నుంచి 5 కిలోల కంది విత్తనాలు అవసరం అవుతాయి. ఈ లెక్కన రాష్ట్రంలో 60 వేల నుంచి లక్ష క్వింటాళ్ల విత్తనాలు కావాలని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నుంచి 4,558 క్వింటాళ్లు, జాతీయ విత్తన సంస్థ నుంచి 4,300 క్వింటాళ్లు, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 560 క్వింటాళ్లు ఇలా మొత్తం 9,418 క్వింటాళ్ల కంది విత్తనాలు సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.  ప్రైవేటు విత్తన సంస్థల నుంచి14 వేల క్వింటాళ్లను.. మొత్తం కలిపి 23,418 క్వింటాళ్ల వరకు సేకరించాలని ప్రణాళికలు వేసింది. ఇంకా 76,582 క్వింటాళ్ల కంది విత్తనాల కొరత కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో  రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టార్గెట్‌‌కు తగిన విధంగా జిల్లాలకు కేటాయింపులు, సరఫరా లేకపోవడంతో విత్తనాలకు కొరత ఏర్పడినట్లు చెప్తున్నారు.  
సోయాపై చేతులెత్తేసిన సర్కార్  

రాష్ట్రంలో 1.40 లక్షల క్వింటాళ్ల సోయా విత్తనాలు అవసరమవుతాయని అంచనా. నిజామాబాద్​ వంటి జిల్లాల్లో రైతులంతా వరి వైపు మొగ్గు చూపడంతో ఈ యేడు సోయా విత్తనాలు 42,603 క్వింటాళ్లు మాత్రమే అవసరం అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దాదాపు 42,000 క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేసే బాధ్యతను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థకు అప్పగించింది. ఇందులో 40 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను 40.65 శాతం సబ్సిడీతో రైతులకు అందించాలని నిర్ణయించింది. తీరా సీజన్ వచ్చే నాటికి సీన్ అంతా రివర్స్ అయింది. విత్తనాల సప్లై కోసం టీఎస్ఎస్​డీసీ టెండర్లు దక్కించుకున్న మధ్యప్రదేశ్‌‌కు చెందిన ప్రైవేట్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో సర్కార్ ఒక్క గింజ కూడా రైతులకు అందించలేకపోతోంది. ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల రైతులు నాణ్యమైన సోయా విత్తనాల కోసం  అవస్థలు పడుతున్నారు.