పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు : మంత్రి సీతక్క

పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు : మంత్రి సీతక్క

ములుగు, వెలుగు: కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఆదివారం ములుగు మండలం ఇంచర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. పార్టీ బలోపాతానికి ప్రతీ నాయకుడు, కార్యకర్త నిబద్ధతతో కష్టపడి పనిచేయాలని సూచించారు. శ్రమించే వారికి సరైన సమయంలో గుర్తింపు, గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు. 

బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని, మరింత బాధ్యతాయుతంగా వ్యహరించాలన్నారు. ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలందరూ ఒకేతాటిపై ఉంటూ కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ఠం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్​ రేగా కల్యాణి, జిల్లా, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కొత్తగూడ మండలం సాధిరెడ్డిపల్లికి చెందిన పుల్సం రవికిరణ్ అనే దివ్యాగుండికి మంత్రి సీతక్క మూడు చక్రాల స్కూటీ, పలువురికి సీఎంఆర్​ఎఫ్​ చెక్కులను పంపిణీ చేశారు.