బాల్య వివాహాలపై పర్యవేక్షణ పెంచండి..అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

బాల్య వివాహాలపై పర్యవేక్షణ పెంచండి..అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను బాల్య వివాహాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు సమగ్ర కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అధికారులను రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. బాల్య వివాహాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తూ..పర్యవేక్షణ పెంచాలన్నారు. గురువారం ఆమె సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెక్రటరీ శృతి ఓజా, జాయింట్ డైరెక్టర్ మోతి తదితర అధికారులతో నిర్వహించిన సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రంలో వంద శాతం మౌలిక వసతులు కల్పించాలని, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ టీచర్లు, ఆయాలతో ప్రత్యేక సదస్సులు నిర్వహించాలని సూచించారు.

ఖాళీల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అక్టోబర్ తొలి వారంలోగా సిబ్బందికి యూనిఫాంలు సిద్ధం చేయాలని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ద్వారా డిప్లొమా సర్టిఫికెట్ల ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల్లో పాలు, బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ పథకాన్ని విస్తరించాలని, చిన్నారుల పోషకాహారంపై శాంపిల్ సర్వే నిర్వహించాలన్నారు. అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలకు ఆహ్లాదకరమైన రంగులు వేయాలని, వర్షాల నేపథ్యంలో చిన్నారుల భద్రతకు ప్రాధాన్యమిచ్చి అవసరమైతే తాత్కాలిక కేంద్రాలకు మార్చాలన్నారు. రద్దీ ప్రాంతాల్లోని బాలింతల కోసం తల్లిఒడి సెంటర్లను, ప్రతి జిల్లాలో ఒక అడాప్షన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.