ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టాలి..‘తెలంగాణ జలసిరి’ ని విజయవంతం చేద్దాం: సీతక్క

ప్రతి వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టాలి..‘తెలంగాణ జలసిరి’ ని విజయవంతం చేద్దాం: సీతక్క

హైద‌‌రాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ఎల్‌‌నినో పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, నీటి సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకుని ప్రజా ఉద్యమంగా మార్చాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఈ బృహత్తర కార్యక్రమంలో ముందుండి నడవాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతీ వర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టి, భూమిలోకి ఇంకేలా చేయాలన్నారు. తద్వారా భూగర్భ జలాలను గణనీయంగా పెంపొందించవచ్చని పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా విజయవంతం చేయాలని కోరారు. 

గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ, నీటి సంరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత, ప్రతి పొలానికి ఒక పంట కుంట, ప్రతి ఊరికి ఒక ఊట కుంట నిర్మించాలనే లక్ష్యంతో అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ, వర్షపు నీటి సంరక్షణకు అందరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.