వీసీ అప్లికేషన్ల పరిశీలన సెక్రటేరియెట్లోనే?

వీసీ అప్లికేషన్ల పరిశీలన సెక్రటేరియెట్లోనే?
  • ఇప్పటికీ సెర్చ్​ కమిటీలను వేయని సర్కారు
  • ఓ మాజీ వీసీ ఆధ్వర్యంలో ప్రక్రియ!

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు కొత్త వీసీ పోస్టుల కోసం వచ్చిన అప్లికేషన్ల పరిశీలన ఈసారి సెక్రటేరియెట్లోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా వీసీ పోస్టుల కోసం వచ్చిన అప్లికేషన్లను ఉన్నత విద్యామండలి అధికారులు పరిశీలించేవారు. ఈ మేరకు అప్లికేషన్లను తమకు పంపాలని ఉన్నత విద్యామండలి అధికారులు సచివాలయంలోని విద్యా శాఖ కార్యదర్శి పేషీని పలుమార్లు సంప్రదించినా స్పందన
రానట్టు సమాచారం. ఈసారి ఉన్నత విద్యామండలి వైస్‌‌‌‌ చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ ఇద్దరూ వీసీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడంతో.. సెక్రటేరియెట్లోనే అప్లికేషన్ల పరిశీలన జరపాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. గత నెల 24వ తేదీనే రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. కొత్త వీసీల నియామకం కోసం ప్రొఫెసర్ల నుంచి నోటిఫికేషన్​ ఇవ్వగా.. సుమారు వెయ్యి దరఖాస్తులొచ్చినట్టు తెలిసింది. ఆ దరఖాస్తులను పరిశీలించి, సిఫార్సులు చేసేందుకు సెర్చ్​ కమిటీలు వేయాల్సి ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సెర్చ్‌‌‌‌ కమిటీలను వేయలేదు. దానికి బదులుగా ఎంపిక ప్రక్రియను ఓ మాజీ వీసీకి అప్పగించారని.. ఆయన ఆధ్వర్యంలోనే దరఖాస్తుల పరిశీలన చేస్తారని అంటున్నారు. అయితే ఇదంతా గోప్యంగా నిర్వహిస్తుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.