బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి

బిల్డర్ చేతిలో మోసపోయిన భారత క్రికెటర్ తండ్రి

భారత యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ తండ్రి దేశ్‌రాజ్ చాహర్ ఓ బిల్డర్ చేతిలో మోసపోయారు. ఫ్లాట్ అమ్మకం పేరుతో ఆగ్రాలోని గెలాక్సీ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఆయన్ను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఏం జరిగిందంటే..?

రాహుల్ తండ్రైన దేశ్‌రాజ్ 2012లో.. గెలాక్సీ నిర్మాణ్ సంస్థ ఆగ్రాలోని మాగ్తాయ్ గ్రామంలో కొత్తగా నిర్మించిన నర్సి విలేజ్ కాలనీలో ఓ ఇంటిని బుక్ చేసుకున్నారు. అందుకోసం ఆయన రిజిస్ట్రేషన్ ఖర్చులు, వగైరా వంటి వాటి కోసం భారీ మొత్తాన్ని చెల్లించారు. ఆ సమయంలో ఇళ్లు గీతం సింగ్ పేరుతో రిజిస్టర్ చేయబడింది. అనంతరం ఆయన తన కుమారుడైన క్రికెటర్ రాహుల్ చాహర్‌కు ఇంటిని బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఇంటి నిర్మాణం పూర్తవడానికి దశాబ్దకాలం పట్టడంతో ఆయన చాలా ఓపికగా ఎదురుచూశారు. చివరకు ఇంటి నిర్మాణం పూర్తవ్వడంతో.. దాన్ని తన కుమారుడి పేరిట బదిలీ చేయడానికి బిల్డర్‌ను ఆశ్రయించారు. అయితే అందుకు నిర్మాణ సంస్థ అంగీకరించలేదు. బెదిరింపులకు దిగారు. దీంతో రాహుల్ చాహర్ తండ్రి పోలీసులను ఆశ్రయించారు. జగదీష్‌పురా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

ఇప్పటికే ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గెలాక్సీ నిర్మాణ్ ప్రైవేట్ లిమిటెడ్ చేసిన మోసం వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసే పనిలో పడ్డారు.. నివేదికల ప్రకారం.. చాహర్‌ తండ్రిని బెదిరించి, వేదనకు గురిచేసిన వారిలో సంస్థ సేల్స్ హెడ్ పీయూష్ గోయల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై శ్రీ చాహర్ DCP సూరజ్ రాయ్ మాట్లాడుతూ.. కొత్తగా నిర్మించిన కాలనీలో ఇంటిని రిజిస్టర్ చేయడంలో విఫలమైనట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.