సెలెక్టర్లు ధోనీతో మాట్లాడాలి: గంభీర్‌‌

సెలెక్టర్లు ధోనీతో మాట్లాడాలి: గంభీర్‌‌

న్యూఢిల్లీ : వరల్డ్‌‌కప్‌‌ తర్వాత బరిలోకి దిగని మహేంద్రసింగ్‌‌ధోనీతో సెలెక్టర్లు మాట్లాడాలని,  అతని ఫ్యూచర్‌‌ ప్లాన్స్‌‌ తెలుసుకోవాలని టీమిండియా మాజీ క్రికెటర్‌‌, బీజేపీ ఎంపీ గౌతమ్‌‌ గంభీర్‌‌ అభిప్రాయపడ్డాడు. రిటైర్మెంట్‌‌ అనేది వ్యక్తిగత నిర్ణయమేనన్న గౌతీ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని అనుకున్నప్పుడు  ఓ ప్లేయర్‌‌ ఎంపిక చేసుకుని మ్యాచ్‌‌లు ఆడకూడదన్నాడు. వికెట్‌‌ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రిషబ్‌‌ పంత్‌‌తో జట్టు మేనేజ్‌‌మెంట్‌‌తోపాటు కెప్టెన్‌‌ కోహ్లీ, కోచ్‌‌ రవిశాస్త్రి మాట్లాడాలని చెప్పాడు. పంత్‌‌పై ఒత్తిడి పెంచితే అతను తన సామర్థ్యం మేరకు ఆడలేడన్నాడు. షాట్‌‌ సెలెక్షన్‌‌లో పంత్‌‌ పొరపాట్లు చేయడం నిజమేనన్న గంభీర్‌‌.. తనదైన రోజున రిషబ్‌‌ మ్యాచ్‌‌ విన్నర్‌‌గా నిలుస్తాడని తెలిపాడు. వరల్డ్‌‌కప్‌‌లో ఐదు సెంచరీలు చేసిన రోహిత్‌‌శర్మ లాంటి ఆటగాడికి టెస్ట్‌‌ల్లో కచ్చితంగా అవకాశమివ్వాలన్న గౌతీ.. అలాంటి ఆటగాడిని బెంచ్‌‌కు పరిమితం చేయడం తగదన్నాడు. రోహిత్‌‌, ధోనీ అండగా ఉండడం వల్ల ఇంటర్నేషనల్‌‌ క్రికెట్‌‌లో కోహ్లీ కెప్టెన్‌‌గా మంచి పేరు తెచ్చుకున్నాడన్నాడు. కానీ ఫ్రాంచైజీని నడిపించడంలోనే నాయకుడి సిసలైన సామర్థ్యం బయటపడుతుందని చెప్పాడు.