భూములు, ఆస్తులు అమ్ముడు.. రేట్లు పెంచుడు 

భూములు, ఆస్తులు అమ్ముడు.. రేట్లు పెంచుడు 
  • ఆమ్దానీ కోసం వీటిపైనే ప్రభుత్వం ఫోకస్

హైదరాబాద్, వెలుగు: భూములను, ఆస్తులను తెగనమ్మి, పన్నులను, లిక్కర్  రేట్లను పెంచి ఆమ్దానీ సమకూర్చుకోవాలని రాష్ట్ర సర్కారు ప్లాన్  చేసింది. అందుకు తగ్గట్టుగానే బడ్జెట్ను రూపొందించింది.  2021–22 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్స్ అండ్  రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 100 శాతం అదనపు ఆదాయం వస్తుందని, లిక్కర్ పై  అదనంగా రూ. 4,390 కోట్లు వస్తుందని బడ్జెట్లో పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే పన్నులు, లిక్కర్ రేట్లు పెరగడం ఖాయమని తెలుస్తోంది. ఇటీవల ఆదాయం కోసం ఉన్న మార్గాలను స్టడీ చేసిన కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇచ్చింది. ప్రభుత్వ పరిధిలోని నిరర్ధక ఆస్తులను, భూములను అమ్మేయాలని, ల్యాండ్ వ్యాల్యూ పెంచాలని, రిజిస్ట్రేషన్ చార్జీలను, లిక్కర్ రేట్లను కూడా పెంచాలని సిఫారసు చేసినట్టు తెలిసింది. ఈ సిఫారసుల ప్రకారం ముందుకు వెళ్లేందుకు ప్రభుత్వం రెడీ అయింది.  
 

భూములు, ఆస్తులు అమ్మకానికి 
హెచ్ఎండీఏ, రెవెన్యూ, హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను, ఆస్తులను అమ్మేసి రూ.16 వేల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఏటా భూములను అమ్మకానికి పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. కాని ఏదో ఒక కారణంతో బ్రేకులు పడుతున్నాయి. హైదరాబాద్ శివారు కోకాపేటలోని 100 ఎకరాల విలువైన హెచ్ఎండీఏ భూములను అమ్మాలని భావిస్తున్నా.. లీగల్ వివాదాలు తలెత్తడంతో సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ వివాదాలు తొలిగిపోవడంతో వంద ఎకరాల భూమిని అమ్మేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హెచ్ఎండీఏ ఆధీనంలోని మరో 150 ఎకరాలను సేల్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో 871 ఎకరాల భూములు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 638 ఎకరాల భూములు ఉన్నాయి. వీటన్నింటినీ అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజీవ్ స్వగృహ కల్ప కింద రాష్ట్ర వ్యాప్తంగా 3,600 ప్లాట్లు ఉన్నాయి. వీటిని ఓపెన్ మార్కెట్ లో అమ్మితే దాదాపు రూ. వెయ్యి కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది. మొత్తంగా భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా రూ. 16 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 

 

ల్యాండ్ వ్యాల్యూ, రిజిస్ట్రేషన్ చార్జీలు డబుల్
ల్యాండ్ వ్యాల్యూ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచేందుకు ప్రభుత్వం రెడీ అయింది. భూముల విలువలు పెంచితే రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెరుగుతుంది. అదే సమయంలో స్టాంప్ డ్యూటీ చార్జీలను పెంచితే మరింత ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో స్టాంప్ అండ్  రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా 100 శాతం అదనపు ఆదాయం వస్తుందని బడ్జెట్ లో పేర్కొంది. 2020-–21లో రూ.  6,101 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసిన సర్కారు, 2021–-22 బడ్జెట్ లో మాత్రం ఏకంగా రూ. 12,685 కోట్ల ఆదాయం వస్తుందని పేర్కొంది. అంటే ప్రస్తుతం అమలవుతున్న భూముల ధరలు ఏకంగా వంద శాతం పెంచే అవకాశం ఉందని ఆఫీసర్లలో చర్చ నడుస్తోంది. రాష్ట్రం వచ్చినప్పట్నుంచి ల్యాండ్ వ్యాల్యూను పెంచలేదని, ఈసారి పెంచక తప్పదని ఓ సీనియర్ మంత్రి అభిప్రాయపడ్డారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల కోసం కొన్ని రంగాల్లో పన్నుల పెంచుతామన్నారు. 

 

లిక్కర్  రేట్లకు రెక్కలు
రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయాన్ని పెంచుకునేందుకు లాక్ డౌన్ తర్వాత లిక్కర్ ధరలను భారీగా పెంచింది. ఈ ధరల పెంపుపై వ్యతిరేకత లేకపోవడంతో మరోసారి పెంచాలని ప్లాన్ చేస్తోంది. లిక్కర్ పై 2021–22 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 4,390 కోట్లు వస్తుందని బడ్జెట్లో  ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఏడాది ఎక్సైజ్ ఆదాయం రూ. 16,000 కోట్లు ఉండగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఎక్సైజ్ ద్వారా అదనంగా వెయ్యి కోట్లు వస్తుందని అంచనా వేసింది. అలాగే ఎక్సైజ్ పై వ్యాట్ రూపంలో  ప్రస్తుతం రూ. 10,835 కోట్లు ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.14,225 కోట్లు ఆదాయం వస్తుందని, అంటే 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ. 3,390  కోట్లు సమకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. దీన్ని బట్టి చూస్తే లిక్కర్ రేట్లు పెరగడం ఖాయమని అధికార వర్గాలు అంటున్నాయి.