హైదరాబాదీ ప్రముఖ నటుడు చంద్రశేఖర్ కన్నుమూత

హైదరాబాదీ ప్రముఖ నటుడు చంద్రశేఖర్ కన్నుమూత

ముంబై: రామాయణ్ సీరియల్ లో ఆర్య సుమంత్ పాత్రను పోషించిన సీనియర్ నటుడు చంద్రశేఖర్ కన్నుమూశారు. ఆయన వయసు 98 సంవత్సరాలు. ఈరోజు ఉదయం 7 గంటలకు ముంబైలోని నివాసంలో మృతి చెందినట్టు ఆయన కుమారుడు, నిర్మాత అశోక్ శేఖర్ తెలిపారు. కుటుంబసభ్యులందరూ ఇంట్లో ఉన్న సమయంలోనే నిద్రలోనే ఆయన చనిపోయారని అశోక్ తెలిపారు. ఇలాంటి సుఖమైన మరణాన్నే ఆయన కోరుకున్నారని చెప్పారు. నాన్నకు ఎలాంటి అనారోగ్యం లేదని... బతికినన్నాళ్లు ఆరోగ్యంగా బతికారని తెలిపారు.

చంద్రశేఖర్ హైదరాబాద్ లో జన్మించారు. 1950లలో జూనియర్ ఆర్టిస్టుగా తన సినీ కెరీర్ ను ప్రారంభించారు. 250కి పైగా సినిమాలలో ఆయన నటించారు. క‌వి, మ‌స్తానా, బ‌సంత్ బ‌హార్‌, కాలీ టోపీ లాల్ రుమాల్, గేట్ ఆఫ్ ఇండియా, ఫ్యాష‌న్‌, ధ‌ర్మ‌, డ్యాన్స్ డ్యాన్స్‌, ల‌వ్ ల‌వ్ ల‌వ్ త‌దిత‌ర సినిమాల్లో విభిన్న పాత్ర‌లు పోషించి మెప్పించారు. 250కిపైగా చిత్రాల్లో చంద్ర‌శేఖ‌ర్ క‌నిపించారు.1964లో సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించి, డైరెక్టర్ గా కూడా మారారు. హెలెన్ తొలిసారి లీడ్ రోల్ పోషించిన చా చా చా సినిమాను ఆయనే నిర్మించారు. 1966లో స్ట్రీట్ సింగ‌ర్ అనే  సినిమాని తెర‌కెక్కించారు. 70ల్లో ప‌రిచ‌య్‌, కౌశిష్, ఖుష్బూ, మౌస‌మ్ త‌దిత‌ర సినిమాలకు అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ గానూ ప‌నిచేశారు. రామానంద్ సాగ‌ర్ డైరెక్షన్ రూపొందిన రామాయ‌ణ్ సీరియ‌ల్‌ తో విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందారాయ‌న‌. చంద్ర‌శేఖ‌ర్‌కి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ముంబై జుహులోని హాన్స్ క్రెమటోరియంలో ఆయన అంత్యక్రియలు బుధవారం సాయంత్రం జరిగాయి.