హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న అత్యంత విలువైన 540.30 ఎకరాల స్థలంపై పూర్తి హక్కులు దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఉదాసిన్ మఠానివే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ భూముల విలువ రూ.15వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదాసిన్ మఠం వర్సెస్ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ (ఐడియల్ కెమికల్స్) కేసులో మంగళవారం (సెప్టెంబర్ 13) తీర్పు వెలువరించింది. కేసు వివరాలు పరిశీలిస్తే.. కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద ఉన్న ఉదాసిన్ మఠం భూములను 1964, 1966, 1969, 1978లో నాలుగు దఫాలుగా బఫర్ జోన్ ఉన్న గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు 99 ఏండ్లకు లీజుకిచ్చింది. అయితే బఫర్ జోన్ లో ఉన్న ఈ భూముల్లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ 538 ఎకరాల విస్తీర్ణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించింది. దీన్ని సవాల్ చేస్తూ ఉదాసిన్ మఠం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారించిన ట్రిబ్యునల్, 2011లో గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఇచ్చిన లీజును రద్దు చేసింది. ట్రిబ్యునల్ తీర్పును సవాలు చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయగా.. 2013లో ఆ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. 2013లో స్టేటస్ కో మేయింటెన్ చేయాలని ఆదేశించింది. మంగళవారం పిటిషన్ విచారణకు రాగా... గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ.. సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.
తీర్పు హర్షణీయం : ఇంద్రకరణ్ రెడ్డి
సుప్రీంకోర్టు తీర్పు పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విలువైన భూములను కాపాడేందుకు సుదీర్ఘ పోరాటం చేసిన దేవాదాయ శాఖ అధికారులు, దేవాదాయ శాఖ తరఫున వాదించిన న్యాయవాదులను మంత్రి అభినందించారు. దేవుడి మాన్యం భూములపై పూర్తి హక్కు దేవాదాయ సంస్థలకు మాత్రమే చెందుతాయని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసినట్లైందన్నారు.
