లండన్: అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆటలోకి ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్లుగా ఆటకు దూరంగా ఉన్న ఆమె క్వీన్స్ క్లబ్ గ్రాస్ కోర్టు టోర్నీలో విజయం సాధించింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్ డబుల్స్ మ్యాచ్‌లో సెరెనా–విక్టోరియా ఎంబోకో (కెనడా) 7–6 (7/2), 6–2తో మూడోసీడ్ నికోల్ మెలిచార్ మార్టినెజ్–ఎరిన్ రౌట్లిఫ్‌పై గెలిచారు.
2022 యూఎస్ ఓపెన్ తర్వాత సెరెనా ఆడిన తొలి అధికారిక మ్యాచ్ ఇదే. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో సెరెనా గంటకు 120 మైళ్ల వేగంతో రెండు ఏస్‌లు, ఒక సర్వీస్ విన్నర్‌తో ఆకట్టుకుంది. వచ్చే వారం జరిగే బెర్లిన్ ఓపెన్‌లోనూ సెరెనా బరిలోకి దిగనుంది. అయితే ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే వింబుల్డన్‌లో ఆడటంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మొత్తం కెరీర్‌లో సెరెనా 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించింది.
