నిర్భయ ఘటనకు నేటితో ఏడేండ్లు

నిర్భయ ఘటనకు  నేటితో ఏడేండ్లు

    న్యాయంకోసం ఎదురు చూస్తున్నాం: నిర్భయ పేరెంట్స్

    ఢిల్లీలోనే కాదు దేశమంతటా రేప్ లు పెరిగాయని ఆవేదన

    నిర్భయ ఫండ్ వాడుకలో రాష్ట్రాల నిర్లక్ష్యం

దేశాన్ని కదిలించిన నిర్భయ ఘటన జరిగి ఏడేళ్లవుతున్నా.. న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఈ ఘటన తర్వాత ఢిల్లీకి రేప్ క్యాపిటల్ అనే ముద్ర పడింది. అయితే ఢిల్లీపై తమకు ఏ మాత్రం కోపం లేదని నిర్భయ తల్లిదండ్రులు అంటున్నారు. “ఢిల్లీ మా నుంచి అంతా లాగేసుకుంది. అయినా మేము ఢిల్లీని వ్యతిరేకించట్లేదు. మా సొంత రాష్ట్రం యూపీలోనూ ఇలాంటి ఘటనలే చూస్తున్నాం. ప్రపంచంలో అన్నిచోట్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. అలా అని ప్రపంచాన్ని వ్యతిరేకించగలమా? పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. నిర్భయ కేసులో నలుగురు దోషులను త్వరలో ఉరి తీస్తారని తెలిసింది. దీంతో మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. దేవుడి మీద నమ్మకం కోల్పోలేదు” అని నిర్భయ తల్లి అన్నారు. ఆడపిల్లలను గౌరవించేలా పిల్లల్ని  పెంచాలని తల్లిదండ్రులకు సూచించారు.నలుగురు దోషులను ఉరి తీస్తే తమకు న్యాయం జరుగుతుందని నిర్భయ తండ్రి అన్నారు. దేశంలో ఇంకా ఎందరో నిర్భయలు ఉన్నారని,  వాళ్ల కోసం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. రేప్ కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న నిందితులను హైదరాబాద్‌లో
దిశ కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజలు సంబరాలు జరుపుకున్నారని, ఎందుకంటే వేగంగా న్యాయం జరగాలని వారు కోరుకుంటున్నట్లు తెలిపారు.

అక్షయ్ రివ్యూ పిటిషన్ పై రేపు విచారణ

నిర్భయ కేసులోని దోషుల్లో నలుగురు సౌత్ ఢిల్లీలోని రవిదాస్ క్యాంపులో ఉండేవారు. వారిని ఉరి తీస్తారన్న సమాచారంపై స్థానికులు మిశ్రమంగా స్పందించారు. గత ఏడాది అక్షయ్ సింగ్ మినహా ముగ్గురు వేసిన రివ్యూ పిటిషన్ల ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అక్షయ్ సింగ్ రివ్యూ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.

ఆరు రాష్ట్రాలు ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే

నిర్భయ ఘటన తర్వాత మహిళల సేఫ్టీ కోసం 2013లో కేంద్రం రూ.1649 కోట్లతో నిర్భయ ఫండ్ ఏర్పాటుచేసింది. ఇందులో రూ.147 కోట్లు మాత్రమే ఖర్చయినట్లు కేంద్రం తెలిపింది. మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, దమన్ దయ్యూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.

మరిన్ని వెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి