ఐటీడీఏ గాడిన పడేనా?

ఐటీడీఏ గాడిన పడేనా?

ప్రధాన పోస్టులన్నీ ఖాళీ
కనుమరుగవుతున్న పథకాలు
కొత్త పీవోపైనే గిరిజనుల ఆశలు

ఏటూరునాగారం, వెలుగు: గిరిజనుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఐటీడీఏపై ప్రభుత్వం శ్రద్ధపెట్టకపోవడం, పలు శాఖల్లో పనిచేస్తున్న ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గిరిజనులకు ఇబ్బందిగా మారింది. ఐటీడీఏ ఆవిర్భావం తర్వాత ఏర్పాటు చేసిన కొన్ని శాఖలు క్రమంగా కనుమరుగవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు మూడు నెలలకోసారి జరగాల్సిన సమీక్ష సమావేశాలు.. 31 నెలలుగా జరగడం లేదు. గత కొద్ది నెలలుగా జిల్లా కలెక్టరే ఇన్​చార్జి పీవోగా పనిచేస్తున్నారు. తాజాగా ఐటీడీఏకు కొత్త పీవోను నియమించిన నేపథ్యంలో సమస్యల పరిష్కారంపై గిరిజనులు ఆశలు పెట్టుకున్నారు.

ఉన్నా.. లేనట్టుగానే..

ఐటీడీఏ ఏర్పడిన తొలినాళ్లలో పట్టు తయారీ, కుందేళ్ల పెంపకం కేంద్రాలు ఉండేవి. దశాబ్దం కిందనే వాటిని ఎత్తేశారు. ప్రస్తుతం ఉద్యానవన, వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్య శాఖలు ఉన్నా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. ప్రగతి నివేదికల్లోనూ ఈ శాఖలకు చోటు లేకుండా పోయింది. ఈ శాఖల ద్వారా అందే పథకాలు, రాయితీలు గిరిజనులకు అందడం లేదు. అటు ప్రభుత్వం సైతం నిధులు కేటాయించడం లేదు. అవగాహన లేమితో గిరిజనులు సైతం ఆయా శాఖలను సరిగ్గా వినియోగించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాల్సిన ఆఫీసర్లు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.

రివ్యూలు లేవు.. మీటింగులు లేవు..

ఏటూరునాగారం ఐటీడీఏ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉంది. ఐటీడీఏ రూల్స్ ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్ జరగాలి. కానీ 31 నెలలుగా మీటింగ్ నిర్వహించడం లేదు. లాస్ట్ మీటింగ్ 2019 డిసెంబర్ 20న జరిగిందంటే... ఇప్పటివరకు మీటింగ్ ఊసే ఎత్తలేదు. ప్రజాప్రతినిధులు సైతం ఐటీడీఏ మీటింగుల పట్ల లైట్ తీసుకుంటున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు ఉన్నా ఐటీడీఏ రివ్యూ మీటింగ్ పెట్టడం లేదు.

పోస్టుల భర్తీ లేదు..

ఐటీడీఏలో కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో గిరిజనులకు అనుకున్న స్థాయిలో సేవలు అందడం లేదు. వ్యవసాయ శాఖలో రెండు ఏవోలతో పాటు ఏఈవోల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో సబ్సిడీ యంత్రాలు, పనిముట్లు, యంత్ర లక్ష్మి, రైతులకు అవగాహన సదస్సులు వంటివి అందడం లేదు. ఉద్యానవన శాఖలో ప్రాజెక్ట్ హార్టికల్చర్, హర్టికల్చర్ సబ్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీకి నోచుకోవడం లేదు. ఈ శాఖ ద్వారా ఏటూరునాగారం సమీపంలో 20 ఎకరాల్లో ఉద్యానవన శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా.. ఆఫీసర్లు లేక నేడు అది నిరుపయోగంగా మారింది. ఇక పశుసంవర్ధక శాఖకు సంబంధించిన వెటర్నరీ ఆఫీసర్ పోస్టు కొన్నేండ్లుగా భర్తీ చేయడం లేదు. దీంతో గిరిజన ప్రాంతాల్లో పాల డెయిరీల ఏర్పాటు కలగానే మారింది. ఇలా ఐటీడీఏ పరిధిలో దాదాపు 340 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఐటీడీఏ కొత్త పీవోగా అంకిత్

ఏటూరునాగారం ఐటీడీఏ పీవోగా 2019 ఐఏఎస్​ బ్యాచ్​ కు చెందిన అంకిత్ ను నియమిస్తూ సీఎస్ సోమేశ్​కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, గత ఏడాదిగా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఇన్​చార్జి పీవోగా పనిచేస్తున్నారు. పూర్థి స్థాయి పీవోను నియమించాలని ఆదివాసీ సంఘాలు ఇప్పటికే చాలా విజ్ఞప్తులు చేశాయి. ఎట్టకేలకు స్పందించిన సర్కారు... రెగ్యులర్ పీవోను నియమించింది. అంకిత్ నేడు బాధ్యతలు తీసుకోనున్నారు.