కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసింది : గడ్డం సరోజ వివేక్

 కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం అప్పుల పాలు చేసింది : గడ్డం సరోజ వివేక్

సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సతీమణి గడ్డం సరోజ. తెలంగాణను కేసీఆర్ కుటుంబం 10 సంవత్సరాలు పాలించి లక్షల కోట్ల అప్పుల పాలు చేశారని విమర్శించారు. బంగారు తెలంగాణలో బ్రతుకులు బాగుపడతాయని అనుకుంటే కేసీఆర్ కుటుంబం బాగుపడిందని వారి కుటుంబంలో నలుగురికి  ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు.మంథని బోయిన్ పేటలో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబుతో కలిసి చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి సతీమణి సరోజ ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

మనం కొట్లాడి, బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. మంథని ప్రాంతానికి మంత్రి శ్రీధర్ బాబు కుటుంబం ఎంతో సేవ చేసిందని చెప్పారు.  తెలంగాణ ఏర్పాటులో స్వర్గీయ మాజీ కేంద్రమంత్రి కాక వెంకటస్వామి, ప్రస్తుత ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృషి ఉందని తెలిపారు.

1963 లో తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో కాక వెంకట స్వామికి గుండెల మీద గాయమైందని గుర్తు చేశారు. ఆనాడు 11 మంది ఎంపీలతో కాక తెలంగాణ ఉద్యమం చేపట్టారని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే తాను చనిపోవాలని కాక వెంకటస్వామికి ఆశ ఉండేదన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుక రావడానికి వంశీకృష్ణ ముందుకు వచ్చాడని ఓటు వేసి గెలిపించాలని గడ్డం సరోజ వివేక్ కోరారు.