అచ్చంపేట, వెలుగు : గంజాయికి అలవాటు పడిన ఓ యువకుడు ఇంటి ఆవరణలోనే వాటిని పెంచడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం పల్కపల్లిలో వెలుగుచూసింది. అచ్చంపేట ఎస్సై సద్దాం తెలిపిన వివరాల ప్రకారం... నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీలోని నాగనూలుకు చెందిన మధు అచ్చంపేట పట్టణంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ పల్కపల్లిలో నివాసం ఉంటున్నాడు.
మూడేండ్ల కింద గంజాయికి బానిస అయ్యాడు. మార్కెట్‌లో అధిక ధరలకు గంజాయి కొనలేక... తన ఇంట్లోనే మొక్కలను పెంచాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అమ్రాబాద్ మండలం మన్ననూరుతో పాటు హైదరాబాద్‌లో గంజాయి విత్తనాలు సేకరించాడు. రెండేండ్ల నుంచి తన ఇంటి పెరట్లోనే మొక్కలను పెంచుతూ తాను తాగడంతో పాటు ఇతరులకు అమ్మేవాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం గ్రామానికి చేరుకొని మధు ఇంట్లో తనిఖీ చేసి ఐదు కిలోల బరువు గల 18 గంజాయి మొక్కలను గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు మధును అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై తెలిపారు.
