ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణను శాస్త్రీయంగా చేయకపోవడం వల్ల తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో మాలలకు తీవ్ర నష్టం జరిగిందని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డిని ఆయన కార్యాలయంలో శుక్రవారం మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ఆరు నెలలుగా వేస్తున్న నోటిఫికేషన్లలో మాలలకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. వర్గీకరణలో సుప్రీం కోర్టు గైడ్లైన్స్ పాటించకపోవడం వల్లే తాము రిజర్వేషన్లు కోల్పోతున్నామన్నారు. చట్టాన్ని సవరించి 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
