కాప్ 30 క్లైమేట్ సమిట్లో అగ్ని ప్రమాదం..బ్రెజిల్ లోని బెలెమ్ సిటీలో ఘటన

కాప్ 30 క్లైమేట్ సమిట్లో అగ్ని ప్రమాదం..బ్రెజిల్ లోని బెలెమ్ సిటీలో ఘటన
  • కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ సేఫ్ 

బెలెమ్: బ్రెజిల్​లోని బెలెమ్ సిటీలో జరుగుతున్న కాప్ 30 క్లైమేట్ సమిట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం.. గురువారం మధ్యాహ్నం సమిట్ బ్లూ జోన్ లోని ఆఫ్రికన్ పెవిలియన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సదస్సుకు వచ్చిన వివిధ దేశాల మంత్రులు, అధికారులు, సిబ్బంది అంతా పరుగులు తీశారు. 

తర్వాత అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో పొగను పీల్చుకోవడం వల్ల 13 మంది అస్వస్థతకు గురయ్యారని, వీరిలో 12 మంది ట్రీట్​మెంట్ తీసుకుని డిశ్చార్జ్ అయ్యారని బ్రెజిల్ అధికారులు వెల్లడించారు. కాగా, భారత పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ బృందం కూడా ఈ సదస్సులో పాల్గొంటోంది. 

అగ్ని ప్రమాదం నుంచి వారంతా సురక్షితంగా బయటపడ్డారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 190 దేశాలకు చెందిన వేలాది మంది పాల్గొంటున్న ఈ సదస్సులో అగ్ని ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ఈ ప్రమాదానికి కారణమేమిటన్నది అధికారికంగా వెల్లడికాలేదు. కానీ ఆఫ్రికన్ పెవిలియన్ లో మైక్రోవేవ్ లేదా ఏదో ఒక ఎలక్ట్రికల్ డివైస్ కాలిపోవడం వల్లే మంటలు వ్యాపించినట్టుగా చెప్తున్నారు. 

మరోవైపు ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు, క్రైస్తవ మతపెద్దలు విచిత్ర వాదనను తెరపైకి తెచ్చారు. కాప్ 30 సమిట్​కు ఆతిథ్యం ఇస్తున్న బ్రెజిల్​కు చైనా గిఫ్ట్​గా పంపిన కొమ్ముల డ్రాగన్ బొమ్మ దైవశక్తికి వ్యతిరేకమని, అందుకే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని పోస్టులు పెడుతున్నారు.