జేఎన్‌జే కు స్థలాలు ఎందుకు అప్పగించట్లేదు?

జేఎన్‌జే కు స్థలాలు  ఎందుకు అప్పగించట్లేదు?

ఖైరతాబాద్,వెలుగు: జవహర్ లాల్ నెహ్రూ మ్యాక్ హౌజింగ్ సొసైటీ (జేఎన్‌జే)కి  ఇండ్ల స్థలాలను ఎందుకు  అప్పగించడం లేదు.. ? అని ప్రభుత్వాన్ని పలువురు వక్తలు ప్రశ్నించారు.  జేఎన్‌జే హౌజింగ్ సొసైటీకి స్థలాల అప్పగింతపై సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకపోవడం ఆశ్చర్యకరమని ఆవేదన వ్యక్తంచేశారు.  జేఎన్‌జేకు 70 ఎకరాలు ఇస్తూనే మిగిలిన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జేఎన్‌జే సొసైటీ ఫౌండర్‌ మెంబర్‌  పీవీ రమణరావు అధ్యక్షతన మీడియా సంపాదకులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్, మిట్టపల్లి శ్రీనివాస్‌, పాశం యాదగిరి, ఆర్టీఏ మాజీ కమిషనర్‌ దిలీప్‌ రెడ్డి లు హాజరై మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 10 నెలలు దాటినా స్థలాలను స్వాధీనం చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుందో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే కోర్టు ధిక్కరణకు వెళ్లాల్సిందేనని తీర్మానించారు. జేఎన్‌జే కి చెందిన1,100మంది సభ్యులతో మిగతా 5 వేలమంది స్థలాలతో ముడిపెట్టడం సరికాదన్నారు. 

జేఎన్‌జే  ఉద్యమానికి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల సహకారం తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. పేట్‌ బషీరాబాద్‌లోని 38 ఎకరాల స్థలాన్ని వెంటనే సొసైటీకి స్వాధీనపర్చాలన్నారు.  అవసరమైతే నిరాహార దీక్ష కొనసాగించాలని స్పష్టంచేశారు.  అన్ని రాజకీయ పక్షాలను సమన్వయం చేసుకుని, ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్లాలని జేఎన్‌జే సభ్యులకు సూచించారు. అధ్యక్షత వహించిన జేఎన్‌జే ఫౌండర్‌ మెంబర్‌ పీవీ రమణరావు మాట్లాడుతూ ప్రతి సభ్యుడికి స్థలం వచ్చేలా తమ  పోరాటం ఉంటుందని  స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ మీటింగ్ లో  తీసుకున్న తీర్మానాలపై వినతిపత్రాన్ని సీఎం కేసీఆర్ అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీనియర్‌ జర్నలిస్టులు   జగన్మోహనరెడ్డి, అంబటి అంజనేయులు, నాగేశ్వరరావు, అమరయ్య, మాల కొండయ్య, సుందర్‌శర్మ, కేవీఎస్‌ సుబ్రమణ్యం  పాల్గొన్నారు.