పరువు కోసం పూజారి చేసిన హత్య.. హైదరాబాద్ లో దారుణం

పరువు కోసం పూజారి చేసిన హత్య..  హైదరాబాద్ లో దారుణం

హైదరాబాద్ సిటీ శివార్లలోని శంషాబాద్ లో వెలుగు చూసిన మహిళ హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు గురైన అప్సరను చంపింది పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ అని చెబుతున్నారు పోలీసులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిందితుడు వెంకట సాయి సూర్య కృష్ణ పూజారిగా పని చేస్తున్నారు. ఇతనికి అప్సర అనే యువతితో పరిచయం ఉంది. వీళ్లిద్దరి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకోవాలని అప్సర ఒత్తిడి తీసుకొచ్చింది. 

వెంకట సాయి సూర్య కృష్ణకు అప్పటికే పెళ్లయ్యింది.. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అప్సరను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక.. వదిలించుకోవాలని చూశాడు. ఎప్పటికైనా అప్సరతో తలనొప్పులు తప్పవని భావించాడు. చంపేయాలని నిర్ణయించాడు. ఈక్రమంలోనే 2023, జూన్ 3వ తేదీన మాట్లాడాలంటూ.. అప్సరను సరూర్ నగర్ రమ్మని చెప్పాడు. పూజారి వెంకట సాయి చెప్పినట్లే అప్సర సరూర్ నగర్ వచ్చింది. 

అప్పటికే అక్కడకు తన కారులో వచ్చిన పూజారి వెంకట సాయి.. అప్సరను తీసుకుని శంషాబాద్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ కూడా వీళ్లిద్దరి మధ్య పెళ్లి విషయంలో గొడవ జరిగింది. ఆ క్రమంలోనే అప్సర తలపై బండరాయితో కొట్టి చంపేశాడు వెంకట సాయి. స్పాట్ లోనే చనిపోయిన అప్సరను తన కారులోనే తీసుకుని.. సరూర్ నగర్ వచ్చాడు. తహశీల్దార్ ఆఫీస్ వెనక భాగంలోనే నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోని మ్యాన్ హోల్ లో అప్సర శవాన్ని వేసి.. పూడ్చిపెట్టాడు. 

ఇదంతా తానే స్వయంగా చేసినా.. ఏమీ తెలియనట్లు అప్సర కనిపించటం లేదంటూ శంషాబాద్ పోలీసులకు తానే స్వయంగా కంప్లయింట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసు కింద విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ ఫుటేజ్ పరిశీలించగా సరూర్ నగర్ నుంచి శంషాబాద్ వైపు పూజారి వెంకట సాయి – అప్సర కారులో వెళ్లినట్లు గుర్తించారు. దీంతో వెంకట సాయిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అప్సరను చంపినట్లు ఒప్పుకున్నాడు. అప్సరను పూడ్చిపెట్టిన మ్యాన్ హోల్ దగ్గరకు చేరుకున్న పోలీసులు.. శవాన్ని బయటకుతీసి.. పోస్టుమార్టంకు పంపించనున్నారు. 

పూజారి వెంకట సాయి – అప్సర ఒకే కాలనీలో కొంత కాలంగా ఉంటున్నారు. రోజూ ఒకరికి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కొన్నాళ్లుగా ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారు. దీంతో పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయటంతోనే అప్సరను చంపినట్లు చెబుతున్నాడు పూజారి వెంకట సాయి సూర్య కృష్ణ..