నకిలీ ఫోన్‌‌‌‌పేతో గొర్రెల వ్యాపారికి టోకరా.. ఆరుగురు అరెస్ట్..నలుగురికి రిమాండ్

నకిలీ ఫోన్‌‌‌‌పేతో గొర్రెల వ్యాపారికి టోకరా.. ఆరుగురు అరెస్ట్..నలుగురికి రిమాండ్

ఓల్డ్‌‌‌‌సిటీ, వెలుగు: నకిలీ ఫోన్‌‌‌‌పే అప్లికేషన్‌‌‌‌ను ఉపయోగించి గొర్రెల వ్యాపారిని మోసం చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్​ చేశారు. చాంద్రాయణగుట్ట ఏసీపీ ఎ.సుధాకర్, కంచన్‌‌‌‌బాగ్ ఇన్‌‌‌‌స్పెక్టర్ జె.బాలరాజు తెలిపిన వివరాల  ప్రకారం.. డబీర్‌‌‌‌పురాకు చెందిన మహ్మద్ ముస్తఫా హుస్సేన్ (27), మలక్‌‌‌‌పేట్‌‌‌‌కు చెందిన మహ్మద్ సమీ(20), చంచల్‌‌‌‌గూడకు చెందిన మహ్మద్ ముజామిల్(20), చార్మినార్‌‌‌‌కు చెందిన షేక్ గులాం హుస్సేన్(18)తో పాటు ఇద్దరు మైనర్లు మే 24న బక్రీద్ పండుగ కోసం కంచన్‌‌‌‌బాగ్‌‌‌‌లోని గొర్రెల వ్యాపారిని సంప్రదించారు. రూ.68,750 విలువైన ఐదు గొర్రెలను కొన్నారు. నకిలీ ఫోన్‌‌‌‌పే చెల్లింపు రసీదును చూపించి, గొర్రెలతో పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని సేకరించి పరిశీలించి నిందితులను గుర్తించారు. దొంగిలించిన గొర్రెలను వివిధ వ్యక్తులకు విక్రయించి వచ్చిన డబ్బును నిందితులు పంచుకున్నారు. నిందితుల వద్ద నుంచి నేరానికి ఉపయోగించిన ఆరు మొబైల్ ఫోన్లు, మూడు టూ వీలర్లు, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను రిమాండ్​కు తరలించగా, మరో ఇద్దరు మైనర్లను చైల్డ్​ హోంకు తరలించారు.