గ్యాస్ సిలిండర్ పేలుడు కాదు.. రెస్టారెంట్‎లో 21 మంది సజీవ దహనానికి కారణం ఇదే..!

గ్యాస్ సిలిండర్ పేలుడు కాదు.. రెస్టారెంట్‎లో 21 మంది సజీవ దహనానికి కారణం ఇదే..!

న్యూఢిల్లీ: 21 మంది సజీవ దహనమైన ఢిల్లీ అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తు్న్నాయి. ఈ అగ్నిప్రమాదానికి ఎల్పీజీ సిలిండర్ పేలుడు కారణం కాదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

 భవనం అంతర్గత వైరింగ్ వ్యవస్థలోని విద్యుత్ లోపం కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ వైరింగ్‌లో షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడే ఇంతటి తీవ్రమైన మంటలు వ్యాపిస్తాయని.. దీనివల్ల మంటలు భవనంలోని వివిధ భాగాలకు వేగంగా వ్యాపిస్తాయని పేర్కొన్నారు. 

హోటల్‌లో రెండు వేర్వేరు వంటగదులు ఉన్నాయని.. ఒకటి బిల్డింగ్ అండర్ గ్రౌండ్‎లో, మరొకటి పై అంతస్తులో ఉందని తెలిపారు. రెండు వంటగదులలోనూ అనేక ఎల్పీజీ సిలిండర్లు నిల్వ ఉంచినప్పటికీ, ప్రాథమిక తనిఖీలలో సిలిండర్ పేలుడు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు.

ఫోరెన్సిక్ బృందం ఇప్పటికే ప్రమాదానికి గురైన భవనాన్ని తనిఖీ చేసి.. సంఘటనా స్థలం నుంచి నమూనాలను సేకరించింది. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాన్ని నిర్ధారించడానికి నిపుణులు విద్యుత్ వ్యవస్థలను, ఇతర సంభావ్య అగ్నిప్రమాద మూలాలను పరిశీలిస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాతే ఈ ప్రమాదానికి గల స్పష్టమైన కారణం తెలియనుంది. 

దక్షిణ ఢిల్లీలోని మాలవియా నగర్‎లో బుధవారం (జూన్ 03) ఉదయం లెమన్ గ్రీన్ రెస్టారెంట్‎లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్‎లో.. 21 మంది చనిపోగా.. అందులో 17 మంది విదేశీయులే ఉండటం హృదయవిదారకంగా మారింది. అందులో ఎక్కువగా ఆఫ్రికా, మధ్య ఆసియా దేశాలకు చెందిన పర్యాటకులుగా ప్రాథమిక విచారణలో తేలింది. బంగ్లాదేశ్, నైజీరియా, లైబీరియా,మొజాంబిక్ తదితర దేశాల పర్యాటకులుగా గుర్తించారు. మాల్వియా నగర్ లోని హాజ్ రాణీ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం నుంచి ఇంకా ఢిల్లీ కోలుకోనేలేదు. గాయపడిన వారి హాహా కారాలతో ఆసుపత్రులు ప్రతిధ్వనిస్తున్నాయి.

ప్రమాదం జరిగిన తర్వాత సమీపంలో ఉన్న మ్యాక్స్ ఆసుపత్రికి మంటలో కాలిపోయిన వారిని తీసుకొచ్చినట్లు యాజమాన్యం చెప్పింది. మొత్తం 39 మందిని తీసుకురాగా అందులో 18 మంది అప్పటికే చనిపోయి ఉన్నట్లు తెలిపారు. 15 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. 8 మంది వెంటిలేటర్ సపోర్ట్ తో క్రిటికల్ కండిషన్ లో ఉన్నట్లు తెలిపారు.

నిర్వాహకుల దురాశ, నిర్లక్ష్యం:

ఢిల్లీ ప్రమాదానికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. హౌజ్ రాణి ప్రాంతంలోని ఈ హోటల్కు ఢిల్లీ ప్రభుత్వం బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ (బి&బి) పథకం కింద లైసెన్స్ మంజూరు చేసింది. ఒక కాంప్లెక్స్ కేవలం ఆరు గదులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ ఫ్లోరిష్ స్టే, బేస్మెంట్లోని కొన్ని గదులతో సహా 25 గదులను నిర్వహిస్తోంది. 

నిబంధనలకు విరుద్ధంగా 25 గదులను నిర్మించిన యాజమాన్యం.. ఇంతమంది చావుకు కారణమైందని అంటున్నారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ హోటల్కు ఎంట్రీ, ఎగ్జిట్కు ఒకే దారి ఉంది. ఈ హోటల్లో 25 రూమ్ లు ఉండటం, ఏ సమయంలోనైనా అనేక మంది స్టే చేస్తుంటారు. దీనికి తోడు హోటల్కు సేఫ్టీ మెజర్స్ కు సంబంధించిన అనుమతులు కూడా లేనట్లు తెలుస్తోంది. దీనిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.