కామన్వెల్త్‌‌ క్రీడల్లో జ్ఞానేశ్వరికి సిల్వర్‌‌.. రాజా ముత్తుపాండికి రజతం

కామన్వెల్త్‌‌ క్రీడల్లో జ్ఞానేశ్వరికి సిల్వర్‌‌.. రాజా ముత్తుపాండికి రజతం

గ్లాస్గో: కామన్వెల్త్‌‌ క్రీడల్లో ఇండియా వెయిట్‌‌ లిఫ్టర్ల పతకాల జోరు కొనసాగుతోంది. సోమవారం జరిగిన విమెన్స్‌‌ 53 కేజీల వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లో ఆసియా చాంపియన్‌‌షిప్‌‌ కాంస్య పతక విజేత జ్ఞానేశ్వరి యాదవ్‌‌ సిల్వర్‌‌ మెడల్‌‌ను గెలుచుకుంది. ఫైనల్లో జ్ఞానేశ్వరి మొత్తం 199 (స్నాచ్‌‌ 88, క్లీన్‌‌ అండ్‌‌ జర్క్‌‌లో 111) కేజీల బరువు ఎత్తి గేమ్స్‌‌ రికార్డును సృష్టించి రెండో స్థానంలో నిలిచింది. ఒనోమ్‌‌ ఒమోలోలా డిదిహ్‌‌ (నైజీరియా, 206 కేజీ), రెబేక గ్రౌక్స్‌‌ (కెనడా, 178 కేజీ) వరుసగా గోల్డ్‌‌, బ్రాంజ్‌‌ నెగ్గారు. క్లీన్‌‌ అండర్‌‌ జెర్క్‌‌ విభాగంలో జ్ఞానేశ్వరి, ఒనోమ్‌‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

జ్ఞానేశ్వరి 107 కేజీల బరువు ఎత్తి కామన్వెల్త్‌ గేమ్స్‌‌ రికార్డు సృష్టించగా, నైజీరియా అథ్లెట్‌‌ 110 కేజీలతో దాన్ని తిరగరాసింది. వెంటనే జ్ఞానేశ్వరి కూడా 111 కేజీలు ఎత్తి రికార్డును మళ్లీ తన పేరుమీదకు మార్చుకుంది. చివరకు ఒనోమ్‌‌ 113 కేజీలు ఎత్తడంతో స్వర్ణం ఖాయమైంది. ఫైనల్లో జ్ఞానేశ్వరి స్నాచ్‌‌, క్లీన్‌‌ అండ్‌‌ జెర్క్‌‌లో రెండింటిలోనూ ఒక్క ప్రయత్నంలోనూ ఫెయిల్‌‌ కాలేదు.

ఛత్తీస్‌‌గఢ్‌‌లోని బోండియా గ్రామానికి చెందిన 23 ఏళ్ల జ్ఞానేశ్వరి రాష్ట్ర పోలీసు శాఖలో అసిస్టెంట్‌‌ సబ్‌‌ ఇన్​స్పెక్టర్‌‌గా పని చేస్తోంది. ఆమె తండ్రి 
ఒకప్పుడు బాడీ బిల్డర్‌‌. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల దానికి దూరమయ్యాడు. ప్రస్తుతం అతను ఎలక్ట్రిషియన్‌‌గా పని చేస్తున్నాడు. ఓవరాల్‌‌గా వెయిట్‌‌ లిఫ్టింగ్‌‌లో ఇండియాకు ఇది ఆరో పతకం కావడం విశేషం. 

ఫైనల్లో సాజన్‌‌

మెన్స్‌‌ 200 మీటర్ల బటర్ ఫ్లై విభాగంలో ఇండియా స్విమ్మర్‌‌ సాజన్‌‌ ప్రకాశ్‌‌ అదరగొట్టాడు. హీట్‌‌–2లో బరిలోకి దిగిన 32 ఏళ్ల సాజన్‌‌ 1:58.59 సెకన్ల టైమింగ్‌‌తో రెండో స్థానంలో నిలిచాడు. ఓవరాల్‌‌గా హీట్స్‌‌లో ఆరో అత్యుత్తమ టైమింగ్‌‌తో ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. 

రాజా మెరిసె..

మెన్స్‌‌ 65 కేజీల్లో ఇండియాకు మరో పతకం లభించింది. స్టార్‌‌ లిఫ్టర్‌‌ రాజా ముత్తుపాండి స్నాచ్‌‌, క్లీన్‌‌ అండ్‌‌ జెర్క్‌‌లో మొత్తం 286 కేజీల బరువు ఎత్తాడు. 11 ఏళ్ల కిందట కామన్వెల్త్‌‌ యూత్‌‌ గేమ్స్‌‌లో స్వర్ణం నెగ్గిన ముత్తుపాండి అదే ఏడాది జూనియర్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లోనూ సిల్వర్‌‌తో మెరిశాడు. అయితే 2019 కామన్వెల్త్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మోకాలి గాయానికి గురైన ముత్తుపాండి రెండేళ్ల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. 2021లో రీ ఎంట్రీ ఇచ్చిన అతను తర్వాత వరుస చాంపియన్‌‌షిప్స్‌‌లో పతకాలు కొల్లగొట్టాడు. మలేసియా లిఫ్టర్‌‌ అంజిల్‌‌ బిన్‌‌ బిల్డిన్‌‌ ముహమ్మద్‌‌ (299 కేజీ), మోరియా బారు (పపువా న్యూగినియా) వరుసగా స్వర్ణం, కాంస్యం సాధించారు.