స్పాట్ మార్కెట్లో ధర తగ్గినా రిటైల్ రేట్లు తగ్గట్లే..! నిజంగానే వెండి రేట్లను తారుమారు చేస్తున్నారా..?

స్పాట్ మార్కెట్లో ధర తగ్గినా రిటైల్ రేట్లు తగ్గట్లే..! నిజంగానే వెండి రేట్లను తారుమారు చేస్తున్నారా..?

Silver Manipulation: మార్కెట్‌లో వెండి రేట్లు పెను ప్రకంపనలు సృష్టిస్తూ కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 40 శాతం కుప్పకూలాయి. బంగారం, వెండి కలిపి సుమారు రూ. 830 లక్షల కోట్ల సంపద ఆవిరి చేశాయి. అయితే ఈ పతనం వెనుక వెండికి డిమాండ్ తగ్గడం కంటే.. పేపర్ మార్కెట్ మాయాజాలం మార్కెట్ మానిపులేషన్ ప్రధాన కారణాలుగా ఉన్నాయని నిపుణులు  అంటున్నారు. దీని ప్రభావం రిటైల్ కొనుగోలుదారులపై ఎలా ఉంటుంది. రేట్లలో వ్యత్యాసం కొనసాగుతుందా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పేపర్ వెండి వర్సెస్ ఫిజికల్ వెండి..

ప్రస్తుతం వెండి స్పాట్ ధర (పేపర్ మార్కెట్) దాదాపు ఔన్సు రేటు79 డాలర్ల వద్ద ఉండగా.. భౌతిక వెండి ధర మాత్రం ఔన్సుకు 101 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సాధారణంగా వీటి మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న ఈ భారీ వ్యత్యాసం భౌతిక వెండికి డిమాండ్ ఇంకా బలంగానే ఉందని సూచిస్తోంది. అసలు సమస్య వెండి లభ్యతలో లేదు, వెండిని నమ్ముకుని ఆడే లివరేజ్ ఆటలో ఉందని అంటున్నారు నిపుణులు.

1:400 నిష్పత్తి.. అంతులేని పేపర్ సప్లై

మార్కెట్‌లో ఒక ఔన్సు ఫిజికల్ వెండి అందుబాటులో ఉంటే.. దానికి ప్రతిగా సుమారు 400 పేపర్ కాంట్రాక్టులు చలామణిలో ఉన్నాయి. అంటే వెండిని గనుల నుంచి తవ్వాల్సిన పనిలేకుండానే బ్యాంకులు కేవలం కాగితంపై కాంట్రాక్టులను సృష్టించి ట్రేడింగ్ చేస్తున్నాయి. జనవరి 2026 నాటికి కేవలం 113-124 మిలియన్ ఔన్సుల డెలివరీ ఇవ్వదగ్గ వెండి ఉండగా, మార్కెట్‌లో 508 మిలియన్ ఔన్సుల పేపర్ కాంట్రాక్టులు ఉన్నాయి. ఒకవేళ కాంట్రాక్ట్ హోల్డర్లలో ఒక చిన్న శాతం మంది తమకు 'ఫిజికల్ సిల్వర్' కావాలని అడిగితే ఎక్స్ఛేంజీల వద్ద ఇచ్చేందుకు వెండి ఉండదు.

మార్జిన్ కాల్స్ మానిపులేషన్..

పెద్ద బ్యాంకులు, సంస్థాగత ఇన్వెస్టర్లు తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో వెండిని ట్రేడ్ చేయడానికి లివరేజ్ సౌకర్యాన్ని వాడుతుంటారు. ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు, తమ పొజిషన్లను కాపాడుకోవడానికి ట్రేడర్లు అదనపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. అలా లేని పక్షంలో ఎక్స్ఛేంజీలు బలవంతంగా ఆ కాంట్రాక్టులను తక్కువ ధరకే అమ్మేస్తాయి. ఇది ధరలను మరింత కిందికి నెట్టివేస్తుంది. 

చైనా మార్కెట్లు సెలవులో ఉన్నప్పుడు.. తక్కువ ట్రేడింగ్ జరిగే సమయంలో పెద్ద బ్యాంకులు వెండిని భారీగా డంప్ చేసి ధరలను పడగొట్టాయి. దీనివల్ల సామాన్య రిటైల్ పెట్టుబడిదారులు భయపడి తమ దగ్గరున్న వెండిని అమ్మేస్తారు. ఆ తక్కువ ధర వద్దే మళ్లీ పెద్ద సంస్థలు తమ షార్ట్ పొజిషన్లను క్లోజ్ చేసుకుని లాభపడతాయి.

మరి వెండి భవిష్యత్తు ఏంటి..?

ప్రస్తుతం వెండి రేట్లలో పతనం కేవలం బలహీనమైన ఇన్వెస్టర్లను బయటకు పంపడానికేనని నిపుణుడు మను రిషి గుప్తా అభిప్రాయపడ్డారు. గత పదేళ్లలో వెండి ధరలను తారుమారు చేసినందుకు పెద్ద బ్యాంకులు 1.3 బిలియన్ డాలర్ల జరిమానా కూడా చెల్లించాయని చెప్పారు. వెండి, బంగారం గత రెండేళ్లలో వరుసగా 270%, 140% లాభాలను ఇచ్చాయి. రాబోయే పదేళ్లలో వెండి ధర ఔన్సుకు 300 నుంచి 500 డాలర్లకు చేరే అవకాశం ఉందని, ప్రస్తుత పతనాన్ని చూసి భయపడి అమ్మేస్తే తర్వాత పశ్చాత్తాపం తప్పదని ఆయన హెచ్చరిస్తున్నారు.