డబ్బు సంపాదించాలనే కోరిక ఉండటం తప్పు కాదు. కానీ అది దురాశగా మారినప్పుడు ప్రాణాల మీదికి రావడమే కాకుండా ఆర్థిక జీవితం అల్లకల్లోలమవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వ్యక్తి స్టోరీ ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. పెట్టుబడిదారుల అత్యాశ, సరైన అవగాహన లేకపోవడం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతాయో ఆర్థిక సలహాదారు ఆదిత్య షా లైవ్ ఎగ్జాంపుల్ తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేయటంతో అది ఇప్పుడు చాలా మంది గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్టర్లకు కళ్లు తెరిపిస్తోంది.
సాధారణంగా బంగారం, వెండిలను దీర్ఘకాలిక భద్రత కోసం కొనుగోలు చేస్తారు. కానీ ఒక ఇన్వెస్టర్ ఏకంగా తన క్రెడిట్ కార్డు పరిమితిని పూర్తిగా వాడేసి ఏకంగా రూ.10 లక్షల విలువైన బంగారం, వెండిని కొనుగోలు చేశాడు. కేవలం నెల రోజుల్లోనే 10 నుంచి 12 శాతం లాభం వస్తుందని.. ఆ లాభంతో అప్పు తీర్చి మిగిలిన డబ్బు వెనకేసుకోవచ్చని ప్లాన్ చేశాడు. అయితే మార్కెట్ లెక్కలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంతో.. ఆ ఇన్వెస్టర్ ఇప్పుడు భారీ నష్టాల్లో కూరుకుపోయాడు. అటు లాభం రాకపోగా, ఇటు క్రెడిట్ కార్డు బిల్లు కట్టడానికి తల ప్రాణం తోకకు వస్తోందట.
Agree and resonate with you. I too had a conversation like this with one of my clients from a Tier 2 city, he asked me if he could use his credit card to purchase gold coins as the price was surging - I didn't encourage and told him the asset must not be acquired through debt and…
— Arun Sundar Dhinakaran (@Im_ArunDhina) February 2, 2026
చాలామంది మధ్యతరగతి పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారాన్ని కూడా షేర్ మార్కెట్ లాగానే చూస్తున్నారు. తక్కువ కాలంలో అమ్మేసి లాభాలు సంపాదించాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బంగారం అనేది రెగ్యులర్ గా డబ్బులు ఇచ్చే ఆస్తి కాదు. పైగా అత్యధిక వడ్డీ ఉండే క్రెడిట్ కార్డు అప్పుతో ఇటువంటి ఒడిదుడుకులు ఉండే లోహాలపై బెట్ కాయడం అంటే గోతిలో వారంతట వారే దూకడం లాంటిది అంటున్నారు నిపుణులు. సరైన ఎగ్జిట్ ప్లాన్ లేదా నష్టాన్ని తట్టుకునే శక్తి లేకుండా చేసే ఇటువంటి పనులు ఆర్థిక విధ్వంసానికి దారితీస్తాయి.
సంపద అనేది నెమ్మదిగా నిర్మించబడుతుంది, కానీ పేదరికం అనేది క్షణాల్లో వస్తుంది అంటూ సోషల్ మీడియాలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒక అద్భుతం జరిగి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలనే ఆశే ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు పునాది వేస్తుందంటున్నారు మరికొందరు. అనుభవం లేకుండా, అధిక వడ్డీకి అప్పులు తెచ్చి ఊహాజనిత మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం జూదం కంటే ప్రమాదకరం అని కామెంట్ చేస్తున్నారు. ఈ స్టోరీ మనందరికీ ఇచ్చే సందేశం ఒక్కటే.. పెట్టుబడి పెట్టేటప్పుడు మన దగ్గర ఉన్న మిగులు డబ్బును వాడాలి తప్ప, అధిక వడ్డీకి అప్పులు తెచ్చి సాహసాలు చేయకూడదు అన్నదే.
