15 నుంచి సమ్మె..సింగరేణి సీఎండీకి నోటీస్

15 నుంచి సమ్మె..సింగరేణి సీఎండీకి నోటీస్

గోదావరిఖని : సింగరేణిలో లే ఆఫ్​కు బదులు లాక్ డౌన్ ప్రకటించాలని, అదే విధంగా కార్మికులకు పూర్తి వేతనం చెల్లించాలని జాతీయ కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ నెల 14లోగా సమస్యలను పరిష్కరించని పక్షంలో 15 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి. ఈ మేరకు సింగరేణి సీఎండీకి సమ్మె నోటీస్ ఇచ్చినట్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ ప్రకటించాయి. ఆయా సంఘాల నేతలు గురువారం గోదావరిఖనిలో మీడియాతో మాట్లాడారు. కోల్‌‌ ఇండియాలో డీజీఎంఎస్‌‌ ఇచ్చిన నోటీసుతో అక్కడి గనుల్లో లాక్‌‌ డౌన్‌‌ ప్రకటిస్తే, సింగరేణి యాజమాన్యం మాత్రం 22 అండర్ గ్రౌండ్ గనుల్లో సగం జీతంతో కూడిన లే ఆఫ్ ప్రకటించిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం ప్రకారం లాక్ డౌన్ చేయాలె తప్ప లే ఆఫ్ ఇవ్వకూడదన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాల కోతకు సింగరేణికి ఎలాంటి సంబంధం లేదని, కార్మికులకు జీతాలు రాష్ట్రం ఇవ్వదని స్పష్టం చేశారు. కంపెనీనే జీతాలు చెల్లిస్తుందని, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం కోత చెల్లదని పేర్కొన్నారు. ఇక కోల్ ఇండియా కార్మికుల అనుమతి తీసుకొని పీఎంఆర్ఎఫ్​కు కార్మికుల ఒక్కరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చిందని చెప్పారు. కానీ సింగరేణి యాజమాన్యం మాత్రం కార్మికులను సంప్రదించకుండానే ఒక్క రోజు జీతం మొత్తం రూ.7.50 కోట్లను సీఎంఆర్ఎఫ్​ఇచ్చిందన్నారు. కార్మికుల వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇప్పటికైనా టీబీజీకేఎస్‌‌ కార్మికుల పక్షాన నిలబడి పోరాడాలని సూచించారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వై.గట్టయ్య,  ఐఎన్‌‌టీయూసీ సెక్రటరీ జనరల్‌‌ బి.జనక్‌‌ ప్రసాద్‌‌, బీఎంఎస్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు కెంగెర్ల మల్లయ్య, హెచ్‌‌ఎంఎస్‌‌ ప్రధాన కార్యదర్శి రియాజ్‌‌ అహ్మద్‌‌, సీఐటీయూ అధ్యక్షుడు టి.రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అంకుల్ మా డాడీని కొట్టొద్దు