- సింగరేణి సీఎండీ శ్రీధర్
హైదరాబాద్, వెలుగు: గనుల రక్షణపై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అన్నారు. సోమవారం హైద్రాబాద్ సింగరేణి భవన్‌లో డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రివ్యూ చేశారు. ‘‘ఇటీవల జరిగిన ప్రమాదాలలో నలుగురు కార్మికులు ఒక అధికారి చనిపోవడం విచారకరం. రక్షణ లేకుండా జరిగే ఉత్పత్తికి విలువలేదు. ఉత్పత్తి కన్నా కార్మికుల ప్రాణాలు, వారి సేఫ్టీనే ముఖ్యం. ఇందుకోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గని అధికారులదే.ఈ విషయంలో అవసరమైన వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. అవసరమైన పరికరాలను కొనుగోలు చేయండి’’ అని సీఎండీ జీఎంలను ఆదేశించారు. భారీ యంత్రాల రక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
రక్షణ చర్యలు పాటించని వారిపై హోదాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని శ్రీధర్హెచ్చరించారు. ఇటీవలి వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినప్పటికీ మిగిలిన రోజుల్లో రోజుకి 2.10 లక్షల టన్నుల బొగ్గు రవాణా, 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ ను తొలగించాలని సూచించారు. మార్చి నెలాఖరుకు 680 లక్షల టన్నుల బొగ్గు రవాణా సాధించాలని ఆదేశించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యలను జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సహాయంతో పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు కె.చంద్రశేఖర్, ఎన్.బలరామ్, అడ్వైజర్లు డి.ఎన్.ప్రసాద్, కె.సురేంద్రపాండే, ఇ.డి. కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జీఎంలు కె.సూర్యనారాయణ, సురేందర్ లు పాల్గొన్నారు.
