2021– 22 ప్రొడక్షన్ ప్లాన్ రెడీ
ఈ సారి లక్ష్యానికి కరోనా దెబ్బ
ఈ ఏడాది ఉత్పత్తి 50.15 మిలియన్ టన్నులే
2020–21లో సింగరేణి 70.50 మిలియన్ టన్నుల టార్గెట్ పెట్టు కున్నా.. మార్చి 31 నాటికి 50.16 మిలియన్ టన్నుల ఉత్పత్తికి మాత్రమే చేరుకోనుంది. భారీ వర్షాలు, కరోనాతో లక్ష్యం నెరవేరలేదు. ఓసీపీల నుంచి 60.85 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 45.72 మిలియన్ టన్నులు, భూగర్భ గనుల నుంచి 9.65 మిలియన్ టన్నులకు గాను 4.43 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే జరిగింది. వచ్చే ఏడాది టార్గెట్ రీచ్ అయ్యేందుకు ఏప్రిల్ నుంచే పకడ్బందీ ప్లాన్ అమలుచేయాలని సింగరేణి యాజమాన్యం ఆదేశించింది.
గోదావరిఖని, వెలుగు : సింగరేణి సంస్థ వచ్చే ఏడాది 70.56 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకుంది. ఏప్రిల్‌నుంచి మొదలయ్యే 2021-–22 ఫైనాన్షియల్ఇయర్లో ఆరు జిల్లాల పరిధిలో విస్తరించిన 11 డివిజన్లతో పాటు ఒడిశాలోని నైనీ బ్లాక్‌ల్ బొగ్గును వెలికితీయడానికి డివిజన్ల వారీగా సింగరేణి మేనేజిమెంట్ టార్గెట్లు నిర్ణయించింది.
కొత్తగూడెం నుంచే 30 మిలియన్ టన్నులు
కొత్తగూడెం, మణుగూర్ డివిజన్లలోనే ఎక్కువ బొగ్గు వెలికితీయాలని టార్గెట్ విధించింది. ఈ ఏరియాల్లో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లుండడంవల్ల ఎక్కువ ఉత్పత్తి సాధించడం వీలవుతుందని భావిస్తోంది. కొత్తగూడెం డివిజన్‌లో14.30 మిలియన్ టన్నులు, మణుగూర్ డివిజన్‌లో 11.20 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని టార్గెట్ పెట్టింది. ఇల్లందు డివిజన్‌లో 5, ఆర్జీ 1 ఏరియాలో 3.19, ఆర్జీ 2 డివిజన్‌లో 7.90, ఆర్జీ 3లో6.20, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా (ఏపీఏ)లో 2.20, బెల్లంపల్లిలో 3.40, మందమర్రిలో 5.15, శ్రీరాంపూర్ ఏరియాలో 6.58, భూపాలపల్లిలో 4.44 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సారి కొత్తగా ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ నుంచి ఒక మిలియన్ టన్ను బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం పనులను వేగవంతం చేశారు. మొత్తం టార్గెట్‌లో 30.50 మిలియన్ టన్నులు కొత్తగూడెం రీజియన్‌లోని మూడు డివిజన్ల నుంచే సాధించాలని ప్లాన్ చేశారు. 25 భూగర్భ గనుల నుంచి 9.56 మిలియన్ టన్నులు, 20 ఓపెన్ కాస్ట్‌ల నుంచి 61 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టనున్నారు.
కొత్త ప్రాజెక్ట్‌లపై ఆశలు
కొత్త ప్రాజెక్టుల నుంచి కూడా వచ్చే ఏడాది ఉత్పత్తి చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు. ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం ఓపెన్ కాస్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి మొదలైంది. వచ్చే ఏడాది గోదావరిఖనిలోని ఓసీపీ 5, కొత్తగూడెంలోని వికె ఓసీపీ, ఆసిఫాబాద్ జిల్లాలోని గోలేటి ఓసీపీ, భూపాలపల్లి ఏరియాలోని వెంకటాపూర్ ఓసీపీ, బెల్లంపల్లి ఏరియాలోని మహావీర్‌ఖని ఓసీపీ, నైనీ ఓసీపీ నుంచి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఆర్‌కె 7 ఎల్‌ఇపి, భూపాలపల్లి ఓసీపీ, జేకే ఓసీపీ మూసివేయనున్నందున కొత్త ప్రాజెక్ట్‌లమీద ఫోకస్ పెట్టారు.
