రెండేళ్లలో రూ.41 కోట్ల బీమా సొమ్ము చెల్లింపు

రెండేళ్లలో రూ.41 కోట్ల బీమా సొమ్ము చెల్లింపు
  • 45 సింగరేణి కార్మిక కుటుంబాలకు అందించిన యాజమాన్యం
  • కార్మికుల సంక్షేమంలో సింగరేణి సరికొత్త అధ్యాయం
  • దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ స్కీమ్​లు
  • అధికారికంగా వివరాలు ప్రకటించిన సంస్థ సీఎండీ బుద్ద ప్రకాశ్​ జ్యోతి

హైదరాబాద్​, వెలుగు: కార్మికుల సంక్షేమంలో సింగరేణి సరికొత్త అధ్యాయాన్ని సృష్టిస్తోంది. సింగరేణిలో అమలు చేస్తున్న పలు సంక్షేమ స్కీమ్‌‌లు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. గడిచిన రెండేళ్లలో ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు సంస్థ రూ.41 కోట్ల బీమా సొమ్మును అందజేసింది. కాలు కోల్పోయి దివ్యాంగుడిగా మారిన ఒక కార్మికునికి రూ.కోటి అందజేసి యాజమాన్యం మానవత్వాన్ని చాటుకున్నది.ఒకప్పుడు గని ప్రమాదంలో కార్మికుడు చనిపోతే అతని కుటుంబానికి ఆర్థిక సాయం అందడంలో ఎంతో ఆలస్యం జరిగేది. ఒకవేళ అందినా అది కూడా అరకొరగా ఉండేది.

ఎవరైనా అనుకోని ప్రమాదాలలో మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు తీవ్రమైన మానసిక క్షోభతో పాటు, ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. కుటుంబంలో సంపాదించే దిక్కును కోల్పోవడంతో పెళ్లి కావాల్సిన పిల్లలు, చదువుకునే బిడ్డలు, ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆర్థిక పరమైన చిక్కుల్లో ఇరుక్కునేవాళ్లు. అలాంటిది సింగరేణి అమలు చేస్తున్న సంక్షేమ స్కీమ్‌‌లు ఆ సంస్థ కార్మికులు, ఉద్యోగులకు ప్రస్తుతం ఎంతో భరోసా ఇస్తున్నాయి. సింగరేణి సీఎండీ బుద్దా ప్రకాశ్ జ్యోతి ఆదివారం అధికారికంగా ఈ సంక్షేమ స్కీమ్స్ వివరాలను మీడియాకు వెల్లడించారు.

సింగరేణిలో అమలవుతున్న సంక్షేమ స్కీమ్‌‌లు ఇవే

కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిలో పలు సంక్షేమ స్కీమ్‌‌లకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా 2024లో సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు రూ.కోటి ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది. తమ సంస్థలో పనిచేస్తున్న 40,275 మంది ఉద్యోగులకు సింగరేణి ప్రాంతంలో బ్రాంచీలు కలిగి ఉన్న వివిధ బ్యాంకుల ద్వారా యాజమాన్యం నెలనెలా జీతాలు చెల్లిస్తోంది. కార్పొరేట్ శాలరీ అకౌంట్స్ కలిగి ఉన్న వీరందరికీ పైసా అదనపు ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండా ఈ బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఎస్‌‌బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకులు రూ.కోటి చొప్పున.. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు రూ.1.25 కోట్ల చొప్పున ప్రమాద బీమా అందించడానికి ముందుకు వచ్చాయి.

కార్మికులు, ఉద్యోగుల సహజ మరణానికి కూడా రూ.10 లక్షల ఉచిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. కార్పొరేట్ శాలరీ ఖాతా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఇది అమలవుతుంది. ఇందులో బ్యాంక్ ఆఫ్ బరోడా గరిష్టంగా రూ.15 లక్షల సహజ బీమా పథకాన్ని అందిస్తుండటం విశేషం.

ఎస్‌‌బీఐ బ్యాంక్ సహకారంతో కార్పొరేట్ శాలరీ ఖాతా కలిగి ఉన్న వారందరికీ నామమాత్రపు ప్రీమియంతో రూ.50 లక్షల ఆరోగ్య బీమాను అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్‌‌లో ఏడాదికి కేవలం రూ.8,906 ప్రీమియం చెల్లిస్తే సింగరేణి కార్మికుడు, ఉద్యోగి, అతడి జీవిత భాగస్వామి, 25 ఏళ్ల లోపు ఇద్దరు పిల్లలకు రూ.50 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. ఇది 63 ఏళ్ల వయసు వరకు ఉంటుంది. ఆ తర్వాత ప్రీమియంలో స్వల్ప పెరుగుదలతో ఈ ఆరోగ్య బీమాను కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం సింగరేణిలో రూ.40 లక్షల ప్రమాద బీమా స్కీమ్‌‌ను అమలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సింగరేణిలో దాదాపు 30 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి సంక్షేమంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి, కుటుంబాలకు ప్రమాద బీమా ద్వారా భద్రత కల్పించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్స్ కలిగిన వారికి పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.40 లక్షలకు, హెచ్‌‌డీఎఫ్‌‌సీ రూ.30 లక్షల ప్రమాద బీమాను చెల్లిస్తోంది.

రిటైర్డ్ ఉద్యోగులకు సైతం తమ పింఛన్ డబ్బులను ఏ బ్యాంక్ ద్వారా అయితే పొందుతారో, ఆ బ్యాంక్ నుంచి రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉచిత ప్రమాద బీమా వర్తింపజేయడానికి సింగరేణి సంస్థ పలు బ్యాంకులతో సంప్రదింపులు జరిపింది. దీనికి బ్యాంకర్లు అంగీకరించారు. సింగరేణిలో పనిచేసిన కాలంలోనే కాకుండా, వారు 61 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ పొందిన అనంతరం కూడా ఈ ఉచిత ప్రమాద బీమా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు.

ప్రమాదంలో మృతి చెందిన వారికే కాకుండా కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి, ఇతర అవయవాలు ప్రమాదానికి గురై పాక్షిక లేదా శాశ్వత అంగవైకల్యం చెందినప్పటికీ కూడా బ్యాంకులు ప్రమాద బీమా పథకం అమలు చేస్తున్నాయి. దీని కింద రూ.కోటి వరకు ఆర్థిక సాయం అందిస్తున్నాయి.

45 కుటుంబాలకు రూ.41 కోట్లు పంపిణీ..

ఈ సంక్షేమ స్కీమ్‌‌లు ప్రవేశపెట్టిన రెండేళ్లలో ఇప్పటివరకు 45 మంది కుటుంబాలకు రూ.41 కోట్లను సంస్థ అందజేసింది. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన 32 మంది సింగరేణి ఉద్యోగుల కుటుంబాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.28 కోట్లు, 13 మందికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.13 కోట్లు చెల్లించినట్లు సింగరేణి సీఎండీ బుద్దా ప్రకాశ్ జ్యోతి ఆదివారం ప్రకటించారు. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుడు సత్యనారాయణ గని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోగా అతని కుటుంబం ఆర్థిక ఇబ్బందు ల్లో చిక్కుకుంది.

ఈ సమయంలో ప్రమాద బీమా పథకం కింద ఆ కార్మిక కుటుంబానికి రూ. కోటి చెక్​ను బ్యాంకర్లు అందించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎస్టీపీపీకి చెందిన ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగి కంబాల రాజేశ్​కుటుంబానికి రూ.50 లక్షల ప్రమాద బీమా చెల్లించారు. ఈయన జీతం నెలకు రూ.25 వేలు మాత్రమే. రాజేశ్​ మరణించడానికి ఒక నెల ముందు పంజాబ్​ నేషనల్​ బ్యాంక్​లో తన శాలరీ అకౌంట్​ తెరిచాడు. రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడంతో ఏడేళ్ల లోపు వయసున్న అతని ఇద్దరు పిల్లలు, భార్య జీవితం ఒక్కసారిగా అగాధంలోకి పడిపోయినట్లయింది. అయితే, ఈ ప్రమాద బీమా డబ్బులు సకాలంలో రావడంతో ఆ కుటుంబానికి బలమైన ఆర్థిక భరోసా కలిగిందని సింగరేణి సీఎండీ బుద్దా ప్రకాశ్ జ్యోతి తెలిపారు.