సింగరేణికే మణుగూరు బొగ్గు గని..వేలం నుంచి తప్పుకున్న జెన్ కో

సింగరేణికే మణుగూరు బొగ్గు గని..వేలం నుంచి తప్పుకున్న జెన్ కో
  • అధికారికంగా ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
  • రెండు ప్రభుత్వరంగ సంస్థలతో టెండర్లు వేయించిన ప్రభుత్వం
  • కేంద్రం నిర్వహించిన వేలంలో మొదటి బొగ్గు గని దక్కించుకున్న సింగరేణి
  • రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే దక్కిన గని: మంత్రి వివేక్ వెంకటస్వామి 
  • ఇది కార్మికులకు దక్కిన విజయం: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ‘మణుగూరు పీకేఓసీ-2 డిప్ సైడ్’ బొగ్గు గని సింగరేణి సంస్థకే దక్కింది. రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన వ్యూహాత్మక చర్యల వల్లే ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోని ఈ బొగ్గు మైనింగ్ బ్లాక్ ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వం ముందస్తుగా రెండు ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి, జెన్‌‌‌‌‌‌‌‌కోలతో టెండర్లు వేయించింది. 

సోమవారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించిన వేలంలో జెన్‌‌‌‌‌‌‌‌కో స్వచ్ఛందంగా తప్పుకోవడంతో, 180 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న ఈ బ్లాక్ సింగరేణి సొంతమైంది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. 

తెలంగాణ పారిశ్రామికాభివృద్ధికి ఇది ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. 2015లో వచ్చిన కొత్త చట్టం ప్రకారం కేంద్రం నిర్వహించిన బొగ్గు వేలంలో సింగరేణి పాల్గొనకుండా గత బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాటు అడ్డుకుంది. దీంతో గడిచిన 12 ఏండ్లలో సింగరేణికి ఒక్క బొగ్గు గని కూడా దక్కలేదు. దశాబ్దం తర్వాత మళ్లీ వేలంలో బొగ్గు బ్లాక్ దక్క డంతో సింగరేణి కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సంబు రాలు చేసుకుంటున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలు..

గత బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడి, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు నాణ్యమైన బొగ్గు దొరకని పరిస్థితి దాపురించింది. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని బొగ్గు గనులకు కేంద్ర బొగ్గు గనుల శాఖ నిర్వహించే వేలంలో పాల్గొనకుండా సింగరేణి యాజమాన్యాన్ని ఆనాడు ప్రభుత్వ పెద్దలు అడ్డుకున్నారు. వేలంలో పాల్గొనకపోవడం వల్ల తాడిచెర్ల, కోయగూడెం-3, సత్తుపల్లి-3 వంటి కీలక బొగ్గు బ్లాకులను సింగరేణి కోల్పోయింది. 

వీటిలో తాడిచెర్లను జెన్‌‌కో దక్కించుకోగా, మిగతా రెండింటినీ అరబిందో, అవంతిక అనే ప్రైవేట్ సంస్థలు కైవసం చేసుకున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే 40 వేల మంది సింగరేణి కార్మికుల ఉపాధికి గండిపడే ప్రమాదం ఏర్పడింది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపారు. మణుగూరు బొగ్గు గని ప్రైవేట్ పరం కాకుండా జెన్‌‌కో, సింగరేణిల చేత టెండర్లు వేయించి, ఆపై జెన్‌‌కోను పోటీ నుంచి తప్పుకునేలా చేసి సింగరేణికి బొగ్గు గని దక్కేలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

రూ.43 వేల కోట్ల రెవెన్యూ..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ‘పీకేఓసీ 2 డిప్ సైడ్’ బొగ్గు బ్లాక్‌‌లో నాణ్యమైన జీ8 బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ బొగ్గు బ్లాక్‌‌ వల్ల రూ.43 వేల కోట్లకు పైగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ డిప్ సైడ్ బ్లాక్‌‌లో సుమారు 180 మిలియన్ టన్నుల బొగ్గు రిజర్వ్స్ ఉన్నాయి. సంవ త్సరానికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏండ్ల పాటు ఈ మైన్ నడుస్తుంది. దాదాపు 2 వేల మందికి ఉద్యోగాలు, వేలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. 

రాష్ట్ర ప్రభుత్వానికి రూ.10,500 కోట్లకు పైగా ఆదాయం కూడా లభిస్తుంది. మరోవైపు, రేవంత్ రెడ్డి సర్కార్‌‌‌‌ తీసుకున్న నిర్ణయాలతో సింగరేణి సంస్థకు ఒడిశాలోని నైనీ, తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్‌‌లతో పాటు తాజాగా దక్కిన మణుగూరు పీకేఓసీ2 డిప్ సైడ్ గనులతో సుమారు 860 మిలియన్ టన్నుల కొత్త బొగ్గు రిజర్వ్‌‌లు లభించాయి. 

సగటున ఏడాదికి 22 మిలియన్ టన్నుల చొప్పున 35 ఏండ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. ప్రతక్షంగా 6,500 మంది సింగరేణి కార్మికులకు జీవనోపాధి లభిస్తుంది. పరోక్షంగా 20 వేల కుటుంబాలకు పైగా ఉపాధి దొరుకుతుంది. ఈ మూడు బ్లాక్స్ వల్ల సింగరేణికి రూ.1.95 లక్షల కోట్లకు రెవెన్యూ జనరేట్ అవుతుండగా, రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.48 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. మరోవైపు, మణుగూరు పీకే ఓసీ సింగరేణికి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

తమ పోరాటాల వల్లనే ఈ ఓసీ సింగరేణికి దక్కిందని  సింగరేణి కాలరీస్ వర్కర్స్​యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, కె.రాజ్ కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య పేర్కొ న్నారు. తమ పోరాటం వల్లనే సింగరేణికి ఈ ఓసీ వచ్చిందని ఐఎన్‌‌టీయూసీ, బీఎంఎస్ నేతలు తెలిపారు. సింగరేణికి ఓసీ రావడం పట్ల ఎంప్లాయీస్ యూని యన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నర్సింహరావు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.  

ఇది కార్మికుల విజయం.. గడ్డం వంశీకృష్ణ,

డిప్‌‌ సైడ్ బొగ్గు బ్లాక్ సింగరేణికి దక్కడం కార్మికులు సాధించిన విజయం. బీఆర్‌‌‌‌ఎస్ ప్రభుత్వం ఆంక్షల వల్ల సింగరేణికి ఒక్క కొత్త బొగ్గు బ్లాక్ కూడా వేలంలో దక్కలేదు. 12 ఏండ్ల తర్వాత ఇదే మొదటిది. సింగరేణి కార్మికుల పోరాటం, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక చర్యలతో ఇది సాధ్యమైంది. కార్మికుల సంక్షేమం కోసం నేను ఢిల్లీలో కొట్లాడాను. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశాను.        

 - గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి ఎంపీ

రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే సాధించాం.. 

రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే సింగరేణికి మణుగూరు పీకేఓసీ 2 డిప్ సైడ్ బొగ్గు బ్లాక్ దక్కింది. ఇది రాష్ట్రంలో మరింత పారిశ్రామికాభివృద్ధికి దోహద పడుతుంది. సింగరేణి సంస్థకు ఆర్థిక బలం పెరిగి, కార్మికులకు ఉద్యోగ భద్రత పెరుగుతుంది. తెలంగాణ ఇంధన భద్రతకు భరోసా దక్కుతుంది. సింగరేణి భవిష్యత్ అభివృద్ధికి అవసరమైన వనరులు లభిస్తాయి. ప్రభుత్వానికి, సింగరేణికి, విద్యుత్ రంగానికి, ఉద్యోగులకు మేలు జరుగుతుంది. నేను స్వయంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి ఈ విషయమై విజ్ఞప్తి చేశాను. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో తాడిచెర్ల 2, డిప్ సైడ్ బొగ్గు గనులను సింగరేణి సాధించడం శుభపరిణామం. 

‌‌‌‌- వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర మైనింగ్, కార్మిక శాఖ మంత్రి