- 12లోగా రిలీజ్ చేయకుంటే జెన్ కో ముందు ధర్నా చేస్తం
- సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: సింగరేణి సంస్థకు రాష్ట్ర ట్రాన్స్ కో, జెన్ కో సంస్థలు బకాయిపడిన రూ.59 వేల కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని గుర్తింపు సంఘమైన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) డిమాండ్చేసింది. ఈ నెల 12వ తేదీలోపు బకాయిలు విడుదల చేయకపోతే సింగరేణి కార్మికులతో 13న విద్యుత్ సౌధ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్‌లో విద్యుత్ శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌కు రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వి. సీతరామయ్య, కొరిమి రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సమ్మె నోటీసు ఇచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జెన్‌కో, ట్రాన్స్‌కో సంస్థలు బకాయిలను చెల్లించకపోవడం వల్ల సింగరేణి తన రోజువారీ కార్యకలాపాలను నిర్వహించడంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదని తెలిపారు. కార్మికుల భద్రత, మైనింగ్ కార్యకలాపాలు, నిరంతర బొగ్గు ఉత్పత్తికి అవసరమైన సేఫ్టీ ఎక్విప్‌మెంట్స్, సామగ్రి, యంత్రాల కొనుగోలుకు కూడా ఇబ్బందులు పడుతున్నదని చెప్పారు. దసరా అడ్వాన్స్, లాభాల పంపిణీ బోనస్, ఇతరత్రా కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చడానికి సింగరేణి దగ్గర ఆర్థిక వనరులు లేని దయనీయ పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. సింగరేణి ఆర్థిక స్థిరత్వానికి, కార్మికుల భద్రతకు, నిరంతర బొగ్గు ఉత్పత్తికి ఈ బకాయిల చెల్లింపు అత్యంత ఆవశ్యకమని చెప్పారు. బకాయిల విడుదలకు విద్యుత్ శాఖ కార్యదర్శి హోదాలో ఉన్న నవీన్ మిట్టల్ జోక్యం చేసుకోవాలని కోరారు.
