- సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడి
- ప్రతి బూత్‌కు బీఎల్‌ఏ ఉండాల్సిందేనని ఆదేశం
- పార్టీల ప్రతినిధులతో సీఈఓ భేటీ
హైదరాబాద్, వెలుగు: ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో ఓటర్ల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతోందని, తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు సంబంధించిన షెడ్యూల్ ఏప్రిల్, -మే నెలల మధ్య వెలువడే అవకాశం ఉందని సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో సర్ ప్రక్రియను అత్యంత పారదర్శకగా, పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సర్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)ను రాజకీయ పార్టీలు తప్పనిసరిగా నియమించుకోవాలని సూచించారు.
బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమన్వయం ఉంటేనే ఓటర్ల జాబితాలో తప్పులకు తావుండదని స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం హైదరాబాద్‌లోని సీఈఓ కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ బీఎల్‌ఏల నియామకంలో ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న వారు బీఎల్‌ఏలుగా ఉంటే, బూత్ లెవెల్ అధికారులతో (బీఎల్‌ఓలు) కలిసి సమర్థవంతంగా పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల విషయంలో కచ్చితత్వం ఉండాలంటే క్షేత్రస్థాయిలో రాజకీయ పార్టీల నిఘా అవసరమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ వచ్చాక సమయం తక్కువగా ఉంటుందని, అందుకే రాష్ట్రంలో ముందస్తు సన్నాహకాలు వేగవంతం చేశామని చెప్పారు.
ఇంటింటికీ బీఎల్‌ఓలు..
పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల గుర్తింపు కోసం బీఎల్‌ఓలు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారని సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎస్‌ఐఆర్ సమయంలో బీఎల్‌ఓలు ప్రతి ప్రాంతాన్ని 3 నుంచి 4 సార్లు సందర్శిస్తారని, మొదటి విడతలో ఎన్యుమరేషన్ ఫాంలను పంపిణీ చేస్తారని చెప్పారు. ఎవరైనా ఓటర్లు మ్యాపింగ్‌లో మిగిలిపోతే ఎస్‌ఐఆర్ సమయంలో తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు ఉంటుందని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే తమ లక్ష్యమన్నారు
