సిరిసిల్ల నేతన్నలు ప్రపంచాన్ని ఆకర్షించే వస్త్రాలు తయారు చేస్తున్నరు

సిరిసిల్ల నేతన్నలు ప్రపంచాన్ని ఆకర్షించే వస్త్రాలు తయారు చేస్తున్నరు

హైదరాబాద్‌‌, వెలుగు : సిరిసిల్ల పట్టుచీరలను ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్‌‌తో ప్రమోట్‌‌ చేస్తున్నారు. న్యూజిలాండ్‌‌లో ఆ దేశ మంత్రి ప్రియాంకా రాధాకృష్ణన్‌‌ శనివారం రాత్రి రాజన్న సిరిపట్టు బ్రాండ్‌‌ పట్టుచీరను ఆవిష్కరించారు. మంత్రి కేటీఆర్‌‌ వెబినార్‌‌ ద్వారా ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్ల నేతన్నల ఉత్పత్తులను అంతర్జాతీయ వేదికలపై ఆవిష్కరించడం సంతోషాన్నిస్తుందని కేటీఆర్‌‌ అన్నారు. దీనికి చొరవ చూపిన బ్రాండ్‌‌ తెలంగాణ ఫౌండర్‌‌ సునీతా విజయ్‌‌ను ఆయన అభినందించారు. ఒకనాడు సంక్షోభంలో కూరుకుపోయిన సిరిసిల్ల నేతన్నలు.. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని ప్రపంచాన్ని ఆకర్షించే వస్త్రాలు రూపొందిస్తున్నారని  అన్నారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్‌‌ తదితర నేతన్నలు వినూత్న ఉత్పత్తులు రూపొందిస్తున్నారని తెలిపారు.

నాలుగేళ్ల క్రితం బతుకమ్మ చీరల తయారీని చూసేందుకు సిరిసిల్లకు వచ్చిన తనకు అక్కడి వారి నైపుణ్యం ఆకర్షించిందని బ్రాండ్‌‌ తెలంగాణ ఫౌండర్‌‌ సునీతా విజయ్‌‌ తెలిపారు. హరిప్రసాద్‌‌తో పట్టుచీరలు తయారు చేయించి అమెరికా, యూకే, న్యూజిలాండ్‌‌ సహా ఆరు దేశాల్లో ఆర్డర్లు ఇప్పించామని తెలిపారు. ఇప్పుడు 40 మందికి పైగా నేతన్నలు పట్టు చీరలు తయారు చేస్తున్నారని, వాటికి అంతర్జాతీయ మార్కెట్‌‌లో అమ్మకానికి అవకాశం కల్పిస్తున్నామని సునీత పేర్కొన్నారు.