ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ మీరే చేయమన్నారా..? సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా?

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌  మీరే చేయమన్నారా..? సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా?
  • ఫోన్‌‌ ట్యాపింగ్‌‌  మీరే చేయమన్నారా
  • సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా?
  • కేసీఆర్‌‌‌‌పై సిట్‌‌ ప్రశ్నల వర్షం..ఆధారాలు ముందుంచి ఎంక్వైరీ
  •     పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌‌‌‌రావును ఎస్‌‌ఐబీ చీఫ్‌‌గా ఎందుకు నియమించారు?
  •     ప్రణీత్‌‌రావుకు ప్రమోషన్​ ఎందుకిచ్చారు?
  •     బీఆర్‌‌‌‌ఎస్‌‌కు అనుకూలంగా  ‘స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్‌‌’ టీమ్‌‌ పనిచేసిందా? 
  •     సీఎంవో నుంచి ఎస్‌‌వోటీకి వెళ్లిన వందల ఫోన్‌‌ నంబర్లు ట్యాపింగ్‌‌ లిస్టులో ఉన్నాయి  
  •     ప్రెస్‌‌మీట్‌‌లో విడుదల చేసిన ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి?
  •     ప్రభాకర్‌‌‌‌రావు, రాధాకిషన్‌‌రావు స్టేట్‌‌మెంట్ల ఆధారంగా నాలుగున్నర గంటలు ఎంక్వైరీ

 హైదరాబాద్‌‌, వెలుగు: ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో బీఆర్‌‌‌‌ఎస్‌‌ చీఫ్‌‌, మాజీ సీఎం కేసీఆర్‌‌పై సిట్‌‌ ప్రశ్నల వర్షం కురిపించింది.  హైదరాబాద్‌‌ నందినగర్‌‌లోని ఆయన నివాసంలో ఆదివారం నాలుగున్నర గంటలకు పైగా విచారణ కొనసాగింది. ఈ ఎంక్వైరీని సిట్‌‌ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేశారు.  ప్రభాకర్ రావు, రాధాకిషన్‌‌రావుల స్టేట్‌‌మెంట్ల ఆధారంగా కేసీఆర్‌‌‌‌ను ప్రశ్నించారు. ‘‘సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు..? మీరేనా? మాజీ ఎస్‌‌ఐబీ చీఫ్ ప్రభాకర్‌‌‌‌రావుపై, ప్రణీత్‌‌రావుపై మీకు అంత నమ్మకమేంటి?.. అత్యంత కీలక నిఘా వర్గాల బాధ్యతలు వారికే అప్పగించాల్సిన అవసరమేంటి?.. మీ ప్రభుత్వంలో అడ్డగోలుగా ఫోన్‌‌ట్యాపింగ్‌‌ జరిగిన సంగతి మీకు తెలియదా? ఎవరి అవసరాల కోసం ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ చేశారు?  బీఆర్‌‌‌‌ఎస్‌‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఫోన్‌‌ ట్యాపింగ్‌‌తోనే గుర్తించారా?.. మీరు ప్రెస్‌‌మీట్‌‌లో విడుదల చేసిన ఆడియోలు అవే కదా..? ఫోన్ ట్యాపింగ్‌‌ చేయాల్సిన  అవసరం ఎవరికి ఉంది?’’ ఇలాంటి ప్రశ్నలతో   కేసీఆర్‌‌‌‌ను సిట్‌‌ అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్టు సమాచారం. ఫోన్లను ట్యాపింగ్‌‌‌‌ చేసేందుకు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావునే డిజిగ్నేటెడ్‌‌‌‌ అథారిటీగా ఎందుకు నియమించారు? అనే కోణంలో కేసీఆర్​ను సిట్ ఆరా తీసినట్లు తెలిసింది. 

‘‘ఇంటెలిజెన్స్ పొలిటికల్‌‌‌‌ వింగ్, టాప్‌‌‌‌ సీక్రెట్‌‌‌‌ సెల్‌‌‌‌ అడిషనల్‌‌‌‌ డీఎస్పీగా విధులు నిర్వహించిన భుజంగరావు సహా ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి సమాచారం వచ్చేది? వారి ద్వారా వచ్చిన ఫోన్‌‌‌‌నంబర్లను ట్యాపింగ్‌‌‌‌ చేయాలని మీరే చెప్పారా?.. లేక అధికారులే సొంతంగా చేశారా?’’ అని ప్రశ్నించినట్లు సమాచారం. కాగా.. ఈ ప్రశ్నలకు కేసీఆర్​స్పందిస్తూ.. ‘‘ప్రత్యర్థులపై నిఘా కోసం ఇంటెలిజెన్స్‌‌‌‌ వ్యవస్థ పనిచేస్తున్న విషయం మీకు తెలియదా? ప్రత్యర్థి పార్టీల బలాబలాల సమాచారం సేకరించడం కోసమే ఇంటెలిజెన్స్‌‌‌‌ వ్యవస్థ ఉన్నది అనేది గుర్తుంచుకోండి..నిఘా పెట్టమని మాత్రమే చెప్పాం.. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ చేయమని ఎక్కడా చెప్పలేదు. నేను బాధ్యుడిని కాదు” అని సమాధానాలు ఇచ్చినట్లు తెలిసింది.  ప్రభాకర్ రావు, రాధాకిషన్‌‌రావు నియామకం, ప్రణీత్ రావుకు ప్రమోషన్‌‌కు సంబంధించి పోలీస్ శాఖ నుంచి వచ్చిన  ప్రతిపాదనల మేరకే చేసినట్టు కేసీఆర్ బదులిచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కు వచ్చిన వేల కోట్ల విరాళాలకు సంబంధించి సిట్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చిన విరాళాలు ఇచ్చిన వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆధారాలు చూపినట్లు తెలిసింది. శుక్రవారం అందించిన160 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ నోటీసుల మేరకు కేసీఆర్​ సిట్‌‌‌‌ విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఎర్రవల్లి ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ నుంచి బంజారాహిల్స్‌‌‌‌లోని నందినగర్‌‌‌‌‌‌‌‌ నివాసానికి మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌తోపాటు కేటీఆర్‌‌‌‌, హరీశ్‌‌‌‌రావు సహా పలువురు కీలక నేతలు 
వచ్చారు.

విచారణ సాగిందిలా..?

 కేసీఆర్‌‌‌‌ మాజీ సీఎం కావడంతో సిట్‌‌‌‌ అధికారులు మర్యాదపూర్వకంగా వ్యవహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు  సిట్‌‌‌‌ అధికారులు విచారణ ప్రారంభించారు. రాత్రి7.30 గంటల వరకు దాదాపు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించారు.  2024 మార్చి 10న కేసు నమోదైన తర్వాత సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేశామని కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు సిట్‌‌‌‌ అధికారులు వివరించారు. ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు నేతృత్వంలో జరిగిన ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వల్ల అంతిమ లబ్ధిదారులు ఎవరు? అనే కోణంలో ప్రశ్నించారు. ఈ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేసిన డీసీపీ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌, జూబ్లీహిల్స్‌‌‌‌ ఏసీపీ వెంకటగిరితోపాటు ఐదుగురు సభ్యుల సిట్‌‌‌‌ బృందం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను విచారించింది. ముందస్తుగా కేసీఆర్ వ్యక్తిగత సమాచారంతో పాటు  టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రారంభించిన నాటి నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు నిర్వహించిన పార్టీ కార్యకలాపాల వివరాలతో స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసింది. సీఎంగా పనిచేసిన పదేండ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీలను ఎలా కట్టడి చేశారనే కోణంలో సిట్‌‌‌‌ బృందం 
ప్రశ్నించింది.

ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు ఎలా వచ్చాయి?

ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌గా ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు నియమాకంతోపాటు ఆయన ఏర్పాటు చేసిన ‘స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్‌‌‌‌’ గురించి వివరాలను సిట్‌‌‌‌ బృందం సేకరించినట్లు తెలిసింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని అణచివేడంతోపాటు రాష్ట్రంలో పార్టీకి ఎదురులేకుండా చేసేందుకే ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావుసహా ప్రణీత్‌‌‌‌రావు టీమ్‌‌‌‌ టార్గెట్‌‌‌‌గా ఉన్న వారి ఫోన్లను ట్యాపింగ్‌‌‌‌ చేసిందని సిట్‌‌‌‌ అధికారులు కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు వివరించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ‘‘ మావోయిస్టుల పేరుతో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ లిస్టులో ఉన్న వారి ఫోన్ నంబర్లను ట్యాపింగ్‌‌‌‌ చేశారు. ఇందుకు సంబంధించి రివ్యూ కమిటీ మీకు సమాచారం ఇచ్చిందా? లేక స్వచ్ఛందంగానే చేశారా..? అని సిట్ అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దాటవేసే విధంగా సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. దీంతో పాటు ‘‘మొయినాబాద్‌‌‌‌ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ కేంద్రంగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి మీరు ప్రెస్‌‌‌‌ మీట్‌‌‌‌లో విడుదల చేసిన ఆడియో రికార్డులు ఎక్కడి నుంచి వచ్చాయి?  ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ ద్వారానే వచ్చినట్లు మా దర్యాప్తులో తేలింది” అని అడిగినట్టు సమాచారం. ఇందుకుగాను  “ఇదంతా నాకెందుకు చెప్తున్నారు.. ఇంటెలిజెన్స్‌‌‌‌ వ్యవస్థ ఉన్నదే నిఘా కోసం కదా? ప్రతి ప్రభుత్వంలో నిఘా వర్గాలు పనిచేస్తాయి.. అది మీకు కూడా తెలుసు కదా? అవి డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ వాళ్లు అందించిన రికార్డులే” అని కేసీఆర్​ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. కాగా, సీఎంవో నుంచి వెళ్లిన కొన్ని ఫోన్‌‌‌‌ నంబర్లు ట్యాపింగ్ లిస్టులో ఉన్నట్లు సిట్‌‌‌‌ అధికారులు ఆధారాలు చూపారు. ‘‘ఇలాంటి వాటికి నేను బాధ్యుడిని కాదు.. ఎవరిచ్చారో ఎవరు తీసుకున్నారో వాళ్లనే అడగండి’’ అని కేసీఆర్‌‌‌‌‌‌‌‌ అన్నట్లు తెలిసింది. కాగా, ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు నియామకానికి సంబంధించి  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తనతో తెచ్చిన ప్రభుత్వ జీవోలు, పలు నోటిఫై కాపీలను సిట్‌‌‌‌ చేతికి ఇచ్చినట్లు సమాచారం.

ఆధారాలు చూపుతూ ప్రశ్నలు..

ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావును ఇంటెలిజెన్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌గా, పదవీ విరమణ తర్వాత కూడా ఎస్‌‌‌‌ఐబీ చీఫ్‌‌‌‌గా నియమించడానికి గత కారణాలతో పాటు మాజీ సీఎస్‌‌‌‌లు సోమేశ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, శాంతికుమారి, అప్పటి డీజీపీలు మహేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ అనిల్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, నవీన్‌‌‌‌చంద్‌‌‌‌, కేసీఆర్‌‌‌‌‌‌‌‌ పర్సనల్‌‌‌‌ ఓఎస్డీ రాజశేఖర్‌‌‌‌‌‌‌‌రెడ్డి వాంగ్మూలాలు ఆధారంగా ప్రశ్నించినట్లు తెలిసింది. వీరితో పాటు కేసులో నిందితులైన ప్రభాకర్ రావు, ప్రణీత్‌‌‌‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌‌‌‌రావు స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా సిట్‌‌‌‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆధారాలను చూపుతూ ప్రశ్నించారు. స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డు చేయడంలో భాగంగా డీసీపీ ర్యాంక్‌‌‌‌ అధికారి‌‌‌‌ ప్రశ్నిస్తూ..‘ ‘మావోయిస్టుల కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్‌‌‌‌ బ్రాంచ్‌‌‌‌ పోలీసు సిబ్బందిని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌ పార్టీ కార్యకలాపాలకు వినియోగించినట్లు మా దర్యాప్తులో తేలింది.  మీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఇంటెలిజెన్స్‌‌‌‌ సిబ్బంది పార్టీ కోసమే పనిచేశారా?’’ అని అడిగినట్లు సమాచారం.  ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలతో పాటు బీఆర్‌‌ఎస్‌ పార్టీకి  టార్గెట్‌గా ఉన్న ముఖ్యనాయకులు, ప్రతిపక్షపార్టీల నేతలు సహా వ్యాపారవేత్తల కదలికలను వారి ఆర్థికలావాదేవీలను ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లనే ట్రాక్‌ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని సిట్‌ అధికారులు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఫోన్‌ ట్యాపింగ్‌  చేయాల్సిన అవసరం ఎవరికి ఉందని ప్రశ్నించినట్లు సమాచారం. ప్రభుత్వం నుంచి సేకరించిన రికార్డుల ఆధారంగా ప్రభాకర్ రావు నియామకం వెనుక గల కారణాలపై కేసీఆర్‌‌ నుంచి సిట్‌ వివరాలు రాబట్టినట్టు 
తెలిసింది.

రెండు ట్రంకు పెట్టెల్లో ఆధారాలు

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను సిట్‌‌‌‌ ప్రశ్నించే విధానంతోపాటు ఆయన చెప్పే సమాధానాలు పూర్తిగా చట్టపరిధిలోకి వచ్చే విధంగా ఆడియో, వీడియో రికార్డింగ్‌‌‌‌ పరికరాలను ఏర్పాటు చేశారు. విచారణ అంతా వీడియో రికార్డింగ్ చేశారు. వీటితో పాటు కేసు దర్యాప్తులో భాగంగా నిందితుల నుంచి రికార్డు చేసిన స్టేట్‌‌‌‌మెంట్లు, ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ రిపోర్టులు, ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ ద్వారా చేసిన ఆడియో రికార్డింగులు, వాట్సాప్‌‌‌‌లో షేర్‌‌‌‌‌‌‌‌ చేసుకున్న ఫోన్ నంబర్లు, ఆడియో రికార్డులకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన రెండు ట్రంకు పెట్టెలను కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నివాసానికి తీసుకొచ్చారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఓ సర్వెంట్‌‌‌‌ను మాత్రమే గది వద్దకు అనుమతించారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను ప్రశ్నిస్తున్న సమయంలో సర్వెంట్‌‌‌‌ను కూడా రూమ్‌‌‌‌ బయటకు పంపించారు. కాగా, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌‌‌‌రావు సహా పలువురు న్యాయవాదులు అప్పటికే  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో ఉండగా.. వారినిసెకండ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లోకి అనుమతించ లేదు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ నివాసం చుట్టూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ప్రధానంగా ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావు సహా కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించారు. విచారణ సమయంలో కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు అవసరమైన మెడిసిన్స్‌‌‌‌ అందించారు. కొద్దిసేపు విరామం ఇచ్చారు. అనంతరం ప్రశ్నించడం మళ్లీ కొనసాగించారు.