హైదరాబాద్: ప్రపంచమంతా ఆదివాసీల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించకపోవడం బాధాకరం అని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా కొమురం భీమ్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా పోరాటాల తోనే ఆదివాసీల హక్కులు సాధించుకున్నామని అన్నారు. కొమురం భీమ్ పోరాటాల వల్లే హక్కులను, అధికారాలను రాజ్యాంగంలో పొందుపరిచారని గుర్తు చేసుకున్నారు. ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్య రాజ్య సమితిని కోరడంతో ఆగస్ట్ 9 ని ఆదివాసీ దినోత్సవంగా జరుపుకోవాలని 1982 లో ప్రకటించారని సీతక్క చెప్పారు. 90 దేశాల్లో ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నారని అన్నారు. “ కొమురం భీం పోరాటం చేసి సాధించిన హక్కులను, అధికారాలను ఇవాళ మనం అనుభవిస్తున్నాం. రాజ్యాంగ ఫలాలను మనం పొందే హక్కుగా ఆదివాసి దినోత్సవం జరుపుకోవాలని పిలుపునిస్తున్నాను. జల్ జంగల్ జమీన్ అంటూ కొమరం భీమ్ ఆశయాలను సాధిద్దాం..!” అని సీతక్క అన్నారు.
