తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రముఖ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ ఊహించని రీతిలో దూసుకుపోతోంది. పార్టీ పెట్టిన కొద్ది నెలల్లోనే మొదటి ఎన్నికల్లో 100కు పైగా సీట్లలో ఆధిక్యంలో ఉంటూ మేజిక్ ఫిగర్ 118కి చేరువలో ఉంది. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న డీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ ఈ స్థాయి విజయాన్ని అందుకోవడానికి ఆయన ప్రకటించిన ఏడు ప్రధాన హామీలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మహిళలకు నెలకు రూ. 2,500 ఇచ్చే పథకం, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం, ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, విద్యార్థులకు ఏటా రూ. 15 వేల సాయం వంటి పథకాలు ఓటర్లపై బలమైన ప్రభావం చూపాయి.
ముఖ్యంగా యువత & రైతులను ఆకర్షించిన రెండు పథకాలు విజయ్ విజయానికి వెన్నెముకగా నిలిచాయి. అందులో మొదటిది నిరుద్యోగ భృతి పథకం. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ. 4,000, డిప్లొమా చేసిన వారికి రూ. 2,500 చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ఇచ్చిన హామీ యువతను టీవీకే వైపు మళ్లించింది. ఇక రెండోది అత్యంత కీలకమైన రైతు రుణమాఫీ పథకం. 5 ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న రైతులకు చెందిన అన్ని రకాల రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 50 శాతం వరకు రుణమాఫీ చేస్తామని విజయ్ ప్రకటించారు. ఈ రెండు పథకాలు రాష్ట్రంలో పెను మార్పుకు నాంది పలికాయని, అయితే వీటిని నిలబెట్టుకోవడం విజయ్ ముందున్న అతిపెద్ద సవాలు అని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
