బీఆర్ఎస్ లో వాళ్లు పోటీకి నిరాకరించడంతోనే వీళ్లకి టికెట్లు

బీఆర్ఎస్ లో వాళ్లు పోటీకి నిరాకరించడంతోనే వీళ్లకి టికెట్లు

హైదరాబాద్, వెలుగు :  పార్టీకి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు ధనవంతులైన ఓసీలకు సీట్లు కట్టబెట్టిన బీఆర్ఎస్  అధినేత కేసీఆర్.. ఇప్పుడు గెలుపు అవకాశాలు సన్నగిల్లిన తర్వాత బీసీ నినాదం ఎత్తుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 22 సీట్లే ఇచ్చిన కేసీఆర్.. లోక్‌‌సభ ఎన్నికల్లో పార్టీ తరపున ఆరుగురు బీసీలకు సీట్లు ఇచ్చారు. దీంతో  అభ్యర్థుల ఎంపికలో బీసీలకు కేసీఆర్  పెద్దపీట వేశారని, ఆరు సీట్లు ఇచ్చారని బీఆర్‌‌‌‌ఎస్  నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారంపై ఇతర పార్టీల నేతలతో పాటు  బీఆర్‌‌‌‌ఎస్‌‌లోని బీసీలు కూడా మండిపడుతున్నారు.

వాళ్లు పోటీకి నిరాకరించడంతోనే

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లను బీఆర్‌‌‌‌ఎస్  గెలుచుకుంది. ఆ ఊపుతోనే 2019లో జరిగిన లోక్‌‌సభ ఎన్నికల బరిలో దిగింది. గెలుపు అవకాశాలు మెండుగా ఉన్న ఆ ఎన్నికల్లో బీసీలకు 4 సీట్లే ఇచ్చింది. ఇందులోనూ ఒకటి విజయానికి ఏమాత్రం అవకాశం లేని హైదరాబాద్  సీటు కావడం గమనార్హం. ఇదికాకుండా భువనగిరి, జహీరాబాద్, సికింద్రాబాద్  సీట్లు బీసీలకు ఇచ్చారు. ఇప్పుడు ఈ 4 సీట్లకు అదనంగా నిజామాబాద్, చేవెళ్ల సీట్లను కేటాయించారు. నిజామాబాద్‌‌లో గత రెండు పర్యాయాలు కల్వకుంట్ల కవిత పోటీ చేశారు. ఇప్పుడు పోటీకి ఆమె నిరాకరించడంతో బాజిరెడ్డి గోవర్ధన్‌‌ను నిలబెట్టారు.

ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర్  ముదిరాజ్‌‌కు ఇచ్చిన చేవెళ్ల సీటును గత ఎన్నికల్లో వ్యాపారవేత్త రంజిత్‌‌రెడ్డికి కట్టబెట్టారు. ఆయన ఈసారి బీఆర్‌‌‌‌ఎస్  నుంచి పోటీకి నిరాకరించి, కాంగ్రెస్‌‌  కండువా కప్పుకోవడంతో ఆ సీటును కాసానికి ఇచ్చారు. సికింద్రాబాద్‌‌లో పార్టీ తరపున పోటీ చేసేందుకు బలమైన నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో సిట్టింగ్  ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌‌ను ఒప్పించి ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం టికెట్‌‌ను క్యామ మల్లేష్​  ఆశించారు. కానీ, ఆయనకు టికెట్ ఇవ్వకుండా మంచిరెడ్డి కిషన్‌‌ రెడ్డికి ఇచ్చారు.

ఇప్పుడు మల్లేష్​ను భువనగిరి నుంచి కేసీఆర్  పోటీ చేయిస్తున్నారు. బీఆర్‌‌‌‌ఎస్‌‌కు కాస్తో కూస్తో గెలుపు అవకాశాలు ఉన్న మెదక్‌‌లో మాత్రం రెడ్డి సామాజికవర్గానికి చెందిన వెంకటరామి రెడ్డికి సీటు ఇచ్చారు.  మెదక్  నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్  తరపున పోటీచేసి 2 లక్షల 79 వేల ఓట్లు సాధించిన బీసీ నాయకుడు గాలి అనిల్‌‌ కుమార్‌‌‌‌కు మెదక్‌‌లో సీటు ఇవ్వకుండా జహీరాబాద్  అభ్యర్థిగా నిలబెట్టారు.

ALSO READ:- Venky sequel: మీమ్ లవర్స్ గెట్ రెడీ.. వెంకీ సీక్వెల్పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

ఇక హైదరాబాద్  స్థానంలో యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్ల సంఖ్య భారీగా ఉంది. దీంతో ఇక్కడ అదే సామాజికవర్గానికి చెందిన గడ్డం శ్రీనివాస్ యాదవ్‌‌ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. యాదవుల ఓట్లను చీల్చి ఎంఐఎం నేత అసదుద్దీన్  ఒవైసీకి లబ్ధి చేకూర్చడం, బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చాం అని చెప్పుకోవడానికే  శ్రీనివాస్‌‌కు టికెట్  ఇచ్చారని ఇతర పార్టీల నాయకులు ఆరోపిస్తున్నారు.