దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. జకీర్ నగర్‌లోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిసిటీ బాక్స్‌లో చెలరేగిన మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుమారు 20 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 8 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశాయి. ఈ ప్రమాదంలో ఏడు కార్లు, ఎనిమిది బైక్‌లు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో చాలా మంది గాఢనిద్రలో ఉండటంతో మరణాలు సంభవించాయన్నారు.
