- ప్రధాన నిందితులు నేపాల్‌లో ఉన్నట్లు అనుమానం
- మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
జూబ్లీహిల్స్, వెలుగు: నగరంలో సంచలనం సృష్టించిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ భార్య తనూజ రంజన్ హత్య కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సునీల్ పేర్వార్‌తో పాటు దొంగిలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన దిలీప్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం.. గత నెల 8న జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్‌లోని మాజీ ఐపీఎస్ అధికారి నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని పూణేలోనే రాబరీ, హత్యకు పక్కా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది. రంజన్ ఇంట్లో పనిచేస్తున్న కల్పన పలుమార్లు నేపాలి ముఠా సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఇంటి పరిస్థితులు, లోపలి సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసులో మొత్తం తొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన రాత్రి ముగ్గురు నిందితులు ఇంట్లోకి ప్రవేశించగా, మరో నలుగురు బయట కాపలా కాశారు. ఇంట్లోకి చొరబడిన నేపాలి గ్యాంగ్ అనారోగ్యంతో మంచానికే పరిమితమైన తనూజ రంజన్‌ను అత్యంత దారుణంగా నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేసినట్లు వెల్లడైంది. అనంతరం ఇంట్లో ఉన్న 23 తులాల బంగారాన్ని దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.
రాబరీ అనంతరం రైలులో జంప్..
నిందితులు నాంపల్లి చేరుకుని తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోలీసుల దృష్టి మరల్చేందుకు కాజీపేటలో దిగిపోయి, దొంగిలించిన బంగారాన్ని తొమ్మిది భాగాలుగా పంచుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అక్కడి నుంచి మూడు గ్రూపులుగా విడిపోయిన నిందితులు కొందరు పూణేకు, మరికొందరు ఢిల్లీకి వెళ్లిపోయినట్లు దర్యాప్తులో తేలింది.
నేపాల్‌లో కల్పన, వికాస్..?
ఈ కేసులో కీలక సూత్రధారులుగా భావిస్తున్న కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ప్రస్తుతం నేపాల్‌లో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వికాస్ సూచనల మేరకే కల్పన జూబ్లీహిల్స్‌లోని మాజీ ఐపీఎస్ వినయ్ రంజన్ ఇంట్లో పనికి చేరినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల నమ్మకాన్ని సంపాదించిన ఆమె, ముందస్తు ప్రణాళిక ప్రకారమే నేరానికి స్కెచ్ వేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేకంగా వినయ్ రంజన్ ఇంట్లో లేని సమయాన్నే ఎంచుకుని హత్యతో పాటు భారీ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన అనంతరం ముందుగానే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం నిందితులు వేర్వేరు ప్రాంతాలకు పారిపోయినట్లు గుర్తించారు. నిందితులు మొబైల్ ఫోన్లు ఉపయోగించకపోవడంతో వారి ఆచూకీ కనుగొనడం పోలీసులకు సవాలుగా మారిందని సమాచారం.
