ఎన్నికల చిత్రం : చెప్పుల దండలతో అభ్యర్థి ప్రచారం..

ఎన్నికల చిత్రం : చెప్పుల దండలతో అభ్యర్థి ప్రచారం..

చెప్పు పడినా.. చెప్పు చూపించినా.. చెప్పుతో కొట్టినా.. చెప్పుల దండ వేసినా అది తీవ్ర అవమానం.. ఘోర పరాభవంగా భావిస్తారు.. అలాంటి చెప్పులను దండగా మార్చుకుని.. రోజుకో చెప్పుల దండతోనే ప్రచారం చేస్తున్నారు ఈ రాజకీయ నాయకుడు. మెడలో ఎవరూ చెప్పుల దండ వేయకపోయినా.. ఆయనే ప్రతి రోజూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడే చెప్పుల దండ వేసుకుని మరీ వస్తున్నారు.. 2024 ఎన్నికల విచిత్రాల్లో ఓ వెరైటీ ప్రచారం ఇది.. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. అలీగఢ్ నియోజకవర్గం. ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పండిట్ కేశవ్ దేవ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తు్న్నారు. ఆయనకు ఎన్నికల గుర్తుగా చెప్పు వచ్చింది. ఏప్రిల్ 26వ తేదీన అలీఘడ్ పోలింగ్ జరగనున్న క్రమంలో.. కేశవ్ దేవ్ తన ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఎన్నికల సంఘం తనకు కేటాయించిన చెప్పు గుర్తును విస్తృతంగా ప్రచారం చేసే ఉద్దేశంతో.. రోజూ చెప్పుల దండతో ప్రచారం చేస్తు్న్నారు. దీంతో ఈయన ఒక్కసారిగా హైలెట్ అయిపోయారు.. అలీగఢ్ లో టాక్ అయిపోయారు.

పని చేయని ప్రజాప్రతినిధులు అయిన ఎమ్మెల్యే, ఎంపీలను రీకాల్ చేయాలనే లక్ష్యంతో కేశవ్ దేవ్.. ప్రచారంలో తన డిమాండ్ వినిపిస్తున్నారు. నేను లోకల్.. నా గుర్తు చెప్పు.. నేను ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే ఈ చెప్పులతోనే నన్ను కొట్టండి అంటూ ఇంటింటికీ.. వీధివీధికి వెళ్లి పాదయాత్రగా ప్రచారం చేస్తున్నారాయన. 

పని చేయని ప్రజాప్రతినిధులను చెప్పులతో కొట్టండీ అనే స్లోగన్ విన్నాం.. ఇప్పుడు అవే చెప్పుల దండలను మెడలో వేసుకుని ప్రచారం చేస్తున్న కేశవ్ దేవ్ వింత ప్రచారం అందరినీ ఆకర్షిస్తుంది.