- మరో 600 స్కూళ్లలో ఐటీసీ ల్యాబ్‌లు
- 200 కేజీబీవీల్లో మాడ్యులర్ కిచెన్స్
- తెలంగాణ ఎస్ఎస్‌ఏకు రూ.1,913 కోట్లకు కేంద్రం ఆమోదం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 600 సర్కారు బడుల్లో స్మార్ట్ క్లాస్ రూమ్‌లతో పాటు మరో 600 స్కూళ్లలో ఐటీసీ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కేంద్ర ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (పీఏబీ) ఆమోదం తెలిపింది. ఇందుకు తెలంగాణకు రూ.1,913 కోట్లు ఖర్చు చేసేందుకు అంగీకరించింది. మార్చిలో 2023–24 బడ్జెట్‌పై తెలంగాణ ఎస్‌ఎస్‌ఏ పీఏబీ సమావేశం ఢిల్లీలో జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాల మినిట్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రిలీజ్ చేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో రూ.1,913 కోట్లను తెలంగాణలో ఖర్చు చేస్తామని, ఇందులో కేంద్రం వాటా 60 శాతం, 40 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని మినిట్స్‌లో వెల్లడించింది.
అలాగే, 200 కేజీబీవీల్లో మాడ్యులర్ కిచెన్స్ (మోడర్న్) ఏర్పాటుతో పాటు 80 బడుల్లో ఒకేషనల్ కోర్సులను ప్రారంభించేందుకు పీఏబీ ఆమోదించింది. 38 కేజీబీవీలను ఇంటర్మీడియెట్‌కు అప్‌గ్రేడ్ చేసేందుకు అంగీకరించింది. వీటితో పాటు ఇన్నోవేషన్, బాల కేటగిరీలోని బడుల్లో గ్రీన్‌చాక్ బోర్డులు, పెయింటింగ్స్‌కు నిధులు ఖర్చు చేయనున్నారు. వీటితో పాటు గతంలో ఇచ్చినట్టుగానే యూనిఫామ్, బుక్స్, టీచర్ల శాలరీలకు పీఏబీ ఆమోదం తెలిపింది. అయితే, గతేడాది కేంద్రం ఇచ్చేందుకు అంగీకరించిన బడ్జెట్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే పనుల గురించి కూడా పీఏబీ మినిట్స్‌లో పేర్కొనేవారు. కానీ, ఈసారి కేంద్ర ప్రభుత్వ వాటాతో చేసే పనుల బడ్జెట్‌ను మాత్రమే ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో చేసుకునే పనులకు సెంట్రల్ ఎస్‌ఎస్ఏ ఆమోదం అవసరం లేదని తెలిపింది.