న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి మార్కెటింగ్, ఆఫ్‌లైన్ సేల్స్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో ఉద్యోగులను పెద్ద మొత్తంలో తీసేస్తున్నాయి. ముడి సరుకుల ఖర్చులు పెరగడం, తక్కువ మార్జిన్ ఉండే ఎంట్రీ-లెవెల్ ఫోన్ల అమ్మకాలు 8-–10శాతం తగ్గడమే దీనికి కారణం. గత ఆరు నెలల్లో కార్పొరేట్, కమర్షియల్ విభాగాల్లో ఉద్యోగాల సంఖ్య దాదాపు 12–15 శాతం వరకు తగ్గినట్లు స్టాఫింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
ముఖ్యంగా వన్‌ప్లస్ తన ఆఫ్‌లైన్ నెట్‌వర్క్ టీమ్‌కు చెందిన సుమారు 60 మంది ఉద్యోగులను పూర్తిగా తొలగించగా, రియల్‌మీ తన ఏరియా బిజినెస్ మేనేజర్లను డిస్ట్రిబ్యూటర్ల పేరోల్‌లోకి మారాల్సిందిగా కోరింది. షియోమీ, ట్రాన్సిషన్ (ఇన్ఫినిక్స్, టెక్నో, ఐటెల్) వంటి కంపెనీల ఫీల్డ్ ఫోర్స్ సిబ్బందికి కూడా పింక్ స్లిప్స్ వచ్చాయి.
